Rishabh Pant: పంత్‌కూ ఓ ఫ్యామిలీ ఉంది.. అలా చేయడానికి సిగ్గుండాలి.. ఫ్యాన్స్ పై రోహిత్ సతీమణి ఫైర్
రిషబ్ పంత్ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని షేర్ చేస్తోన్న అభిమానులపై ఆమె తీవ్రంగా మండిపడింది.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ షాక్‌కు గురిచేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ వెళ్తుండగా.. రూర్కీ సమీపంలో రిషబ్ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు కానీ అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పంత్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలంటూ టీమిండియా అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా రిషబ్ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని షేర్ చేస్తోన్న అభిమానులపై ఆమె తీవ్రంగా మండిపడింది. పంత్ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. బాధితులకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారని, ఇలాంటి ఫొటోలు వారిని బాధపెడతాయంది.
‘రిషబ్ పంత్ కారు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటివి వారికి కావాలా? వద్దా? అనేది నిర్ణయించుకోలేరు. సదరు బాధితుల వ్యక్తుల ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడం వల్ల వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్రంగా ప్రభావితమవుతారు. కనీస జ్ఞానం లేకుండా ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు’అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది రితిక. అంతకుముందు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పంత్ కు కారు ప్రమాదం అయిందని తెలియగానే అతను త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టిన కార్తీక్ .. ‘మీ అందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే.. దయచేసి ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేయకండి. పంత్ కు, అతని కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వండి. కొంచెం మానవత్వం చూపండి’ అని కోరాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..