Team India: కోహ్లీ, రోహిత్‌లతో పాటు ఆ ఇద్దరిపై వేటు.. బీసీసీఐ ప్లాన్-బీ రెడీ.. అప్పటి నుంచే.!
India Vs West Indies: మరికొన్ని రోజుల్లో టీమిండియాలో పెద్ద మార్పులు జరగబోతున్నాయని తెలుస్తోంది. భారత జట్టు 'ఫ్యాబ్ ఫోర్' ఇకపై జట్టులో ఉండకపోవచ్చుననే సంకేతాలు వస్తున్నాయి..

మరికొన్ని రోజుల్లో టీమిండియాలో పెద్ద మార్పులు జరగబోతున్నాయని తెలుస్తోంది. భారత జట్టు ‘ఫ్యాబ్ ఫోర్’గా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా ఇకపై ఉండకపోవచ్చుననే సంకేతాలు వస్తున్నాయి. సరిగ్గా 6-7 సంవత్సరాల క్రితం జరిగిన తప్పిదాన్ని మళ్లీ పునరావృతం కాకుండా బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పటికే ప్లాన్ బీ రెడీ చేసినట్లు సమాచారం. 2012-2014 దశలో అప్పటి సీనియర్లు రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం.. టీంను పునర్నించేందుకు చాలా సమయమే పట్టిన విషయం విదితమే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. వెస్టిండీస్ పర్యటన అనంతరం టీమిండియాలో క్రమంగా మార్పులు రావచ్చునట. ఆస్ట్రేలియాలో జరిగే తదుపరి బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లోపు యువ ప్లేయర్లతో పాటు పలువురు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు టీంలో ఉండేలా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.
ఇదిలా ఉండగా.. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా తన సత్తాను నిరూపించుకునేందుకు రోహిత్ శర్మకు వెస్టిండీస్ సిరీస్ కీలకంగా మారనుంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లను ప్రస్తుతానికి పక్కనపెట్టి.. మిడిలార్డర్‌లో పుజారా, రహనేలకు మరో అవకాశం ఇవ్వనుందట. బౌలింగ్‌లో మాత్రం ముకేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు 2021-22 దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ఛతేశ్వర్ పుజారాను టెస్ట్ జట్టు నుంచి తప్పించింది బీసీసీఐ. కానీ, అతడు 6 నెలల తర్వాత తిరిగి వచ్చాడు. అనంతరం ఆడిన 8 టెస్టుల్లో కేవలం 1 సెంచరీ మాత్రమే సాధించగలిగాడు. ఈ పేలవమైన ప్రదర్శన తర్వాత కూడా, BCCI అతడిపై నమ్మకం ఉంచింది. ప్రస్తుతం పుజారా ఆడుతున్న 3వ స్థానం కోసం జైస్వాల్, ఓపెనింగ్‌లో శుభ్‌మాన్ గిల్, సమీప భవిష్యత్తులో రోహిత్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను చూసే అవకాశం ఉంది. కాగా, విండీస్ పర్యటన తర్వాత టెస్ట్ జట్టు ప్రక్షాళన మొదలు కానుందని బీసీసీఐ అధికారి ఒకరు అనధికారికంగా తెలిపారు.
