Vaibhav Suryavanshi : 50 బంతుల్లోనే 96 పరుగులు..సెంచరీ మిస్సైనా స్కాట్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్
స్కాట్లాండ్‌తో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరు అన్నది చూడకుండా బంతి దొరికితే చాలు బౌండరీ అవతలికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 27 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న వైభవ్, ఆ తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చాడు.

Vaibhav Suryavanshi : అండర్-19 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే టీమిండియా కుర్రాళ్లు మైదానంలో నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా 14 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జనవరి 15 నుంచి జింబాబ్వే, నమీబియా వేదికలుగా మెగా టోర్నీ మొదలుకానుండగా, శనివారం (జనవరి 10) జరిగిన వార్మప్ మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్కాట్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ టీమిండియా పవరేంటో చూపించాడు. సెంచరీకి కేవలం ఒకే ఒక్క షాట్ దూరంలో అవుట్ అయి అభిమానుల మనసు ముక్కలు చేసినా, అతను ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతం.
స్కాట్లాండ్‌తో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరు అన్నది చూడకుండా బంతి దొరికితే చాలు బౌండరీ అవతలికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 27 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న వైభవ్, ఆ తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చాడు. మైదానం నలుమూలలా 9 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 50 బంతుల్లోనే 96 పరుగులు సాధించి సెంచరీకి చేరువయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ మరో నాలుగు పరుగులు చేస్తే వంద మార్కు చేరుకుంటాడనగా అవుట్ అయ్యాడు. కేవలం ఒకే ఒక ఫోర్ కొట్టి ఉంటే వరల్డ్ కప్ ముందు వైభవ్ ఖాతాలో మరో సెంచరీ చేరేది.
వైభవ్ సూర్యవంశీకి ఇది వరుసగా మూడో 50 ప్లస్ స్కోరు కావడం విశేషం. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో 68 పరుగులు, 127 పరుగులతో చెలరేగిన వైభవ్, ఇప్పుడు స్కాట్లాండ్‌పై 96 పరుగులు చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్ల బౌలర్లనే భయపెట్టిన ఈ 14 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్, ఇప్పుడు వరల్డ్ కప్‌లో భారత్ తరపున అత్యంత కీలక ఆటగాడిగా మారబోతున్నాడు. జనవరి 15న అమెరికాతో జరగబోయే తొలి మ్యాచ్‌లో కూడా వైభవ్ ఇదే తరహాలో విధ్వంసం సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ మ్యాచ్ ద్వారా గాయాల నుంచి కోలుకున్న టీమ్ కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా జట్టులోకి తిరిగి వచ్చారు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన వీరు, వార్మప్ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపించారు. కెప్టెన్ ఆయుష్ 19 బంతుల్లో 22 పరుగులు చేసి వేగంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టగా, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా నిలకడగా ఆడి 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. వైభవ్ మరియు విహాన్ జోడీ రాణించడంతో స్కాట్లాండ్ ముందు టీమిండియా భారీ స్కోరును ఉంచగలిగింది. ఈ కుర్రాళ్ల ఫామ్ చూస్తుంటే 2026 అండర్-19 వరల్డ్ కప్ భారత్ ఖాతాలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
