2 పరుగులకే ఆలౌట్ ఏంది భయ్యా.. 8 మంది డకౌట్, 34 బంతుల్లోనే ప్యాకప్.. 215 ఏళ్ల చెత్త రికార్డ్ బ్రేక్ చేసిన టీం
County Cricket League: భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రిచ్మండ్ సీసీ జట్టు కేవలం 34 బంతుల్లోనే ముగుస్తుందని ఎవరికీ తెలియదు. రిచ్మండ్ సీసీ బ్యాట్స్ మెన్స్ ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూ పెవిలియన్‌కు చేరారు. ఆ జట్టులోని 8 మంది బ్యాట్స్‌మెన్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. మొత్తం జట్టు 5.4 ఓవర్లలో కేవలం 2 పరుగులకే పెవిలియన్‌కు చేరుకుంది

Richmond CC Middx vs North London CC Middlesex: క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ లీగ్‌లో నార్త్ లండన్ సీసీకి వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌లో రిచ్‌మండ్ సీసీ కేవలం 2 పరుగులకే ఆలౌట్ అయ్యి, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 426 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రిచ్మండ్ సీసీ కేవలం 5.4 ఓవర్లలోనే కుప్పకూలి, 424 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ సీసీ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 426 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. నార్త్ లండన్ బ్యాట్స్‌మెన్ డాన్ సిమ్మన్స్ 140 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించాడు.
అనంతరం 427 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రిచ్‌మండ్ సీసీకి ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి రిచ్‌మండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. కేవలం 34 బంతుల్లోనే పూర్తిగా ఆలౌట్ అయ్యి, అత్యంత తక్కువ స్కోరును నమోదు చేసింది. ఈ 2 పరుగుల స్కోరులో ఒక వైడ్ కూడా ఉంది. రిచ్‌మండ్ సీసీకి చెందిన 8 మంది బ్యాట్స్‌మెన్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం విశేషం. మిగతా ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరు ఒక పరుగు చొప్పున సాధించారు.
1810 నాటి రికార్డ్ బద్దలు..
అయితే, ఫస్ట్ క్లాస్‌లో రెండవ అత్యల్ప స్కోరు సాధించిన రికార్డు ది బిఎస్ జట్టు పేరు మీద ఉంది. 1810లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు తన పేరు మీద అవాంఛనీయ రికార్డును నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో, ది బిఎస్ జట్టు మొత్తం 6 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది కాకుండా, 148 సంవత్సరాల క్రితం మే 24న, ఒక జట్టు కేవలం 12 పరుగుల స్కోరుకే ఆలౌటైంది.
క్రిక్ఇన్ఫో రికార్డుల ప్రకారం, మే 24, 1877న, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్‌పై కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరింది. ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేకపోయారు. ఎడ్వర్డ్ వెల్లింగ్టన్ అత్యధికంగా 7 పరుగులు చేశాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ తరపున ఫ్రెడ్ మోరెల్ అత్యధికంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ను మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ 77 పరుగుల తేడాతో గెలిచింది. ఇది కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్ని అవమానకరమైన రికార్డులు కూడా నమోదయ్యాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యల్ప స్కోర్లు..
టెస్ట్ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు చేసిన రికార్డు న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకుంది. 1955లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ జట్టు కేవలం 26 పరుగులకే ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్‌లో ఈ రికార్డు జింబాబ్వే పేరిట ఉంది. 2024 సంవత్సరంలో, శ్రీలంకపై మొత్తం జింబాబ్వే జట్టు కేవలం 35 పరుగులకే ఆలౌట్ అయింది. అలాగే, 2024 సంవత్సరంలో నైజీరియాపై టి20ఐలో ఐవరీ కోస్ట్ జట్టు కేవలం 7 పరుగులకే పరిమితమైంది.
ఈ షాకింగ్ ఫలితం క్రికెట్ అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. క్రికెట్ అనూహ్యమైన ఆట అని మరోసారి రుజువైంది. రిచ్‌మండ్ సీసీకి ఇది అత్యంత చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








