Virar Kohli: గ్యాప్ దొరికితే ఫ్లైట్ ఎక్కుడే.. లండన్ ట్రిప్‌పై కోహ్లీ ఏమన్నాడంటే..?
Virat Kohli London Rumours: ఐపీఎల్ 2026కు ముందు విరాట్ కోహ్లీపై వచ్చిన లండన్ ట్రిప్ వార్తలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమయ్యాయి. మ్యాచ్‌ల మధ్య గ్యాప్ ఉంటే విదేశాలకు వెళ్తాడన్న ప్రచారంపై కోహ్లీ సోషల్ మీడియాలో సరదాగా స్పందించాడు. దీంతో కోహ్లీ రియాక్షన్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

Virat Kohli London Rumours: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఇటీవల ఆసక్తికరమైన వార్తలు వెలువడ్డాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్‌ల మధ్య విరామం ఉంటే లండన్‌కు వెళ్లేందుకు ప్రత్యేక విమాన సదుపాయం కోరినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా మూడు రోజుల గ్యాప్ ఉంటే లండన్ వెళ్లి, మ్యాచ్‌కు ఒకరోజు ముందు మాత్రమే తిరిగి వస్తానని ఫ్రాంచైజీకి చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలో కోహ్లీ రియాక్షన్..
ఈ వార్తలపై విరాట్ కోహ్లీ తనదైన స్టైల్‌లో స్పందించాడు. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తను షేర్ చేస్తూ రెండు నవ్వుల ఎమోజీలతో స్పందించాడు. దీంతో ఈ వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశాడు. అభిమానులు కూడా కోహ్లీ స్పందనను స్వాగతించారు.
ఐపీఎల్ 2026 షెడ్యూల్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్‌ను మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. గత సీజన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత ఈసారి కూడా జట్టు మంచి ప్రదర్శన చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
రికార్డులపై కోహ్లీ దృష్టి..
ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్‌లో 267 మ్యాచ్‌లలో 8,661 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు, 63 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో 9,000 పరుగుల మైలురాయిని చేరిన తొలి ఆటగాడిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలాగే ఆర్సీబీ తరపున మొత్తం 9,085 పరుగులు చేసిన కోహ్లీ, ఒకే జట్టు తరపున 10,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలవడానికి చాలా దగ్గరగా ఉన్నాడు.
టీ20లో మరో అరుదైన ఘనత లక్ష్యం..
టీ20 క్రికెట్‌లో మొత్తం 13,543 పరుగులు చేసిన కోహ్లీ, 14,000 పరుగుల క్లబ్‌లో చేరడానికి కూడా దగ్గరలో ఉన్నాడు. ఇప్పటికే క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ ఈ క్లబ్‌లో ఉన్నారు.
గత సీజన్‌లో కోహ్లీ ఫామ్..
గత ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. 15 ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసి జట్టుకు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సగటు 54.75, స్ట్రైక్ రేట్ 144.71తో ఆకట్టుకున్నాడు. మొత్తం 8 అర్ధశతకాలు సాధించాడు.
విరాట్ కోహ్లీపై వచ్చిన రూమర్స్ ఎంత వేగంగా వ్యాపించినా, అతను వాటిని సరదాగా కొట్టిపారేశాడు. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ఐపీఎల్ 2026పై ఉంది. కోహ్లీ మరోసారి బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
