RR vs LSG, ఐపీఎల్ 2024: రాహుల్‌, పూరన్‌ల పోరాటం వృథా.. లక్నోపై రాజస్థాన్ విజయం

ఆదివారం (మార్చి 24) సాయంత్రం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌పై విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో కేవలం 173 పరుగులకే పరిమితమైంది. నికోలస్ పూరన్ (64), కెప్టెన్ కేఎల్ రాహుల్ (54) అర్ధ సెంచరీలు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు

RR vs LSG, ఐపీఎల్ 2024: రాహుల్‌, పూరన్‌ల పోరాటం వృథా.. లక్నోపై రాజస్థాన్ విజయం
Rr Vs Lsg Ipl Match
Follow us

|

Updated on: Mar 24, 2024 | 8:05 PM

IPL 2024 సీజన్‌లో మొదటి 3 మ్యాచ్‌ల ట్రెండ్ నాల్గవ మ్యాచ్‌లో కూడా కొనసాగింది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాదిరిగానే, రాజస్థాన్ రాయల్స్ కూడా తమ సొంత మైదానంలో అదరగొట్టింది. విజయంతో కొత్త సీజన్‌ను ప్రారంభించాయి. ఆదివారం (మార్చి 24) సాయంత్రం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌పై విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో కేవలం 173 పరుగులకే పరిమితమైంది. నికోలస్ పూరన్ (64), కెప్టెన్ కేఎల్ రాహుల్ (54) అర్ధ సెంచరీలు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. వీరిద్దరూ మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో లక్నోకు పరాజయం తప్పలేదు. అంతకుముందురాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ జోస్ బట్లర్ రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ వేగంగా రన్స్ చేశాడు కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పవర్‌ప్లేలోరు ఔటయ్యాడు. ఇక్కడ నుండి కెప్టెన్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభమైంది. అతనికి రియాన్ పరాగ్ నుండి మంచి మద్దతు లభించింది. వీరిద్దరూ 11 ఓవర్లలోనే జట్టును 100 పరుగులు దాటించారు.

దంచి కొట్టిన శాంసన్..

ఈ సమయంలో కెప్టెన్ సంజూ శాంసన్ అర్ధ సెంచరీతో రాణించాడు. 33 బంతుల్లో ఈ అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రియాన్ పరాగ్ (43) అర్ధ సెంచరీ చేయలేకపోయాడు. అయితే అతను 43 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడి శాంసన్‌తో కలిసి 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో శాంసన్ ధ్రువ్ జురెల్‌తో కలిసి జట్టును 193 పరుగుల పటిష్ట స్కోరుకు చేర్చాడు. శాంసన్ 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

రాహుల్, పూరన్ అర్థ సెంచరీలు..

ఇక లక్ష్య ఛేదనలో లక్నోకు తొలి ఓవర్‌లోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎప్పటిలాగే స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఆరంభంలోనే వికెట్ తీశాడు. క్వింటన్ డి కాక్‌ని పెవిలియన్ కు పంపించాడు. ఆతర్వాత మూడో ఓవర్‌లో దేవదత్ పడిక్కల్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే ఆయుష్ బడోని వికెట్‌ను నాంద్రే బెర్గర్ తీశాడు. దీంతో లక్నో కష్టాల్లో పడింది. ఆ తర్వాత దీపక్ హుడా (26) తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు రాహుల్. దీపక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్ ధాటిగా బ్యాటింగ్ ఆడాడు. వీరి బ్యాటింగ్ చూస్తే రాజస్థాన్ కు ఓటమి తప్పదేమోననిపించింది. అయితే రాహుల్ ఔటయ్యాక మార్కస్ స్టోయినిస్ కూడా వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో లక్నోకు పరాజయం తప్పలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..