AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ అవార్డు వైభవ్‌ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

Player of the Tournament: క్రికెట్ ఎప్పుడూ బ్యాటర్ల ఆటగానే మారిపోతుందనే విమర్శలకు అశ్విన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి బలాన్ని చేకూర్చాయి. భారీ పరుగులు చేసిన యువ ఆటగాడిని ప్రోత్సహించడం మంచిదే అయినా, టోర్నమెంట్ ఆద్యంతం జట్టును నడిపించిన సీనియర్ ప్లేయర్ సేవలను గుర్తించకపోవడం క్రికెట్ ప్రేమికులను కూడా కాస్త నిరాశకు గురిచేసే విషయమే.

ఆ అవార్డు వైభవ్‌ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
R Ashwin Comments On Vaibhav Suryavanshi Award
Venkata Chari
|

Updated on: Jun 03, 2026 | 6:59 AM

Share

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినా దీనిపై చర్చలు మాత్రం ముగియడం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు గెలిచి చరిత్ర సృష్టించిన వేళ.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు ఎంపికపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అసలైన అర్హుడు ఒకరుంటే, మరొకరికి ఇచ్చారంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి.

టోర్నీ ముగిసినా తగ్గని సెగలు..

ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గా నిలిచాడు. అయితే, ఈ అవార్డు ఎంపికపై రవిచంద్రన్ అశ్విన్ తాజాగా పెదవి విరిచాడు. యువ ఆటగాడి ప్రతిభను గౌరవిస్తూనే, ఈ సీజన్‌లో అంతకంటే ఎక్కువ ప్రభావం చూపిన మరో ఆటగాడికి అన్యాయం జరిగిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

అశ్విన్ దృష్టిలో అసలైన విజేత ఆయనే..!

తన యూట్యూబ్ ఛానల్‌ వేదికగా అశ్విన్ ఈ అవార్డుల ఎంపికపై విశ్లేషించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్ మొత్తంలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాడని అశ్విన్ కొనియాడాడు. కేవలం ఫైనల్ మ్యాచ్‌లోనే కాకుండా, టోర్నీ పొడుగునా భువీ ఒంటిచేత్తో మ్యాచ్‌లను మలుపు తిప్పాడని, అందుకే అతనే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుకు వంద శాతం అర్హుడని స్పష్టం చేశాడు. ప్రస్తుత క్రికెట్‌లో కేవలం బ్యాటర్ల ప్రదర్శనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, మ్యాచ్ ఫలితాలను శాసించే బౌలర్ల కష్టాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఫైనల్‌ పోరులో భువీ స్పెల్ నిర్ణయాత్మకం..

ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై భువనేశ్వర్ కుమార్ వేసిన బౌలింగ్ స్పెల్ మ్యాచ్‌ గమనాన్నే మార్చేసింది. పవర్‌ప్లేలోనే కట్టడిగా బౌలింగ్ చేయడమే కాకుండా, ప్రమాదకరమైన సాయి సుదర్శన్ వికెట్ తీసి ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లలోనూ పాత బంతితో అద్భుత నియంత్రణ ప్రదర్శించి, కీలక సమయంలో జేసన్ హోల్డర్ వికెట్‌ను పడగొట్టాడు. మొత్తంగా తన నాలుగు ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ఈ పొదుపైన బౌలింగే ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిందని అశ్విన్ గుర్తు చేశాడు.

కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’పైనా భిన్నాభిప్రాయం..

ఫైనల్లో 156 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, మొత్తంగా 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్సీబీని విజయతీరాలకు చేర్చినందుకు కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. అయితే ఈ నిర్ణయంతో కూడా అశ్విన్ పూర్తిగా ఏకీభవించలేదు. ఫైనల్ జరిగిన పిచ్, బౌలింగ్ పరిస్థితులను బట్టి చూస్తే, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కంటే భువనేశ్వర్ కుమార్ వేసిన స్పెల్ మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో అత్యంత కీలకమైనదని అశ్విన్ విశ్లేషించాడు.

పర్పుల్ క్యాప్ మిస్ అయినా.. మనసులు గెలిచాడు..

ఈ సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 17.89 సగటుతో, 7.95 ఎకానమీతో 28 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఒకే ఒక్క వికెట్ తేడాతో ఆయన పర్పుల్ క్యాప్‌ను కోల్పోయాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ కాగిసో రబాడ 17 మ్యాచ్‌ల్లో 29 వికెట్లతో ఈ క్యాప్‌ను దక్కించుకున్నాడు. అయినప్పటికీ, పెద్ద మ్యాచ్‌లలో భువీ చూపిన చొరవ, ఒత్తిడిని అధిగమించిన తీరును పరిగణనలోకి తీసుకుంటే, టోర్నీలోనే అత్యుత్తమ అవార్డు భువీకే దక్కాల్సిందని, కానీ ఈ స్టార్ బౌలర్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని అశ్విన్ ముగించాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us