అమ్మమాట కోసం క్రికెట్‌ను వదిలిపెట్టాడు.. కట్‌ చేస్తే అరంగేట్రంలోనే ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచాడు

అరంగేట్ర టెస్టులోనే ఎన్నో అద్భుతమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు అహ్మద్. తొలి రోజు ఐదు వికెట్లు ఘనత సాధించిన రెండో పాక్‌ బౌలర్‌గా, ఓవరాల్‌గా డెబ్యూ టెస్టులో ఐదు వికెట్ల హాల్‌ సాధించిన 13వ పాకిస్తాన్‌ బౌలర్‌గా రికార్డులకెక్కాడు

అమ్మమాట కోసం క్రికెట్‌ను వదిలిపెట్టాడు.. కట్‌ చేస్తే అరంగేట్రంలోనే ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచాడు
Abrar Ahmed
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2022 | 4:39 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్‌కు శుభారంభం లభించింది. ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ నయా స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ ఏకంగా ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచాడు. అబ్రార్‌కు ఇదే మొదటి అంతర్జాతీయ క్రికెట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. కాగా అరంగేట్ర టెస్టులోనే ఎన్నో అద్భుతమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు అహ్మద్. తొలి రోజు ఐదు వికెట్లు ఘనత సాధించిన రెండో పాక్‌ బౌలర్‌గా, ఓవరాల్‌గా డెబ్యూ టెస్టులో ఐదు వికెట్ల హాల్‌ సాధించిన 13వ పాకిస్తాన్‌ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇక అబ్రార్ ప్రదర్శనతో అతని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోతున్నారు. అబ్రార్‌లాగే అతని తండ్రికి కూడా క్రికెట్‌ అంటే విపరీతమైన అభిమానం. అలాగే అన్నయ్య షాజాద్‌ ఖాన్‌ దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో కూడా పాల్గొన్నాడు. ఇక అబ్రార్‌ విషయానికొస్తే.. ఆరేళ్ల వయసునుంచే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. ముల్తాన్‌ మైదానంలో సెహ్వాగ్‌ 300 పరుగులు ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా చూశాడు. అప్పుడే పాక్  బౌలర్ల తప్పులను కనిపెట్టాడు.

అమ్మ మాటను జవదాటలేక..

అయితే అబ్రార్ తల్లికి మాత్రం తన కుమారుడు క్రికెటర్‌ కావడం ఏ మాత్రం ఇష్టం లేదు. అతనిని ఓ గొప్ప పండితుడు చేయాలనుకుంది. అమ్మ మాటను కాదనలేక తొమ్మిదేళ్ల వయసులో రెండేళ్ల పాటు క్రికెట్‌ ను దూరం పెట్టాడు. ఖురాన్‌ను కంఠస్ఠం చేశాడు. ఆతర్వాత అబ్రార్ తల్లి తన కొడుకును ఇస్లామిక్ సైన్స్ చదవమని కోరింది. అయితే ఈసారి మాత్రం అబ్రార్‌ తన తల్లి మాట వినలేదు. తనకు క్రికెటర్‌ కావాలన్న కోరికను వెలిబుచ్చాడు. ఎప్పుడూ అమ్మ మాటకు ఎదురుచెప్పని అబ్రార్‌ మొదటిసారి అలా చెప్పడంతో తల్లి మనసు కూడా అర్థం చేసుకుంది. క్రికెట్‌లో రాణించేందుకు కుమారుడిని ప్రోత్సహించింది.

ఇవి కూడా చదవండి

సునీల్‌ నరైన్‌ను స్ఫూర్తిగా తీసుకుని..

24 ఏళ్ల అబ్రార్ చిన్నప్పటి నుంచి కరేబియన్ ఆటగాడు సునీర్ నరైన్‌ను తన ఆరాధ్యదైవంగా భావిస్తాడు. 19 ఏళ్ల వయసులో తొలిసారి పాకిస్థాన్ జట్టులోకి వచ్చినప్పుడు అతనిని సక్లైన్ ముస్తాక్‌తో సహా మొత్తం టీం అతడిని ఎగతాళి చేసింది. అయితే అప్పటికే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న అబ్రార్‌కు ఆ హేళనలు పెద్ద సమస్యగా అనిపించలేదు. 2016లో జోనల్ అండర్-19లో అబ్రార్ 53 వికెట్లు తీశాడు. ఆ తర్వాత కరాచీ కింగ్స్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో బంతితో అద్భుతాలు చేశాడు. పీఎస్‌ఎల్‌లో రాణించాడు. మధ్యలో కొన్నిసార్లు గాయంతో ఇంటికే పరిమితమైనా తండ్రి దగ్గరుండి ప్రోత్సహించాడు. ఒకొనొక సమయంలో ఆదాయం కోసం అబ్రార్‌ తండ్రి రోజుకు 20 గంటల పాటు ట్యాక్సీని నడిపి కుటుంబాన్ని పోషించారు. అయితే అబ్రార్ క్వాయిడ్-ఎ-అజామ్‌తో పునరాగమనం చేసి, ఆపై సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాటిర్లు ఉన్న ఇంగ్లండ్‌ జట్టును గడగడా వణికించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. మరి రాబోయే రోజుల్లో ఈ మిస్టరీ స్పిన్నర్‌ ఇంకెన్నీ అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..