AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: బుమ్రా గాయం ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలను దెబ్బతీసేనా? సందిగ్ధంలో కోచ్, కెప్టెన్

గత కొన్నేళ్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డ్యాషింగ్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కొన్ని రోజుల క్రితమే గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. తాజాగా యార్కర్ల కింగ్  బుమ్రా కూడా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి దూరమయ్యే సూచనలు  కనిపిస్తున్నాయి.

T20 World Cup 2022: బుమ్రా గాయం ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలను దెబ్బతీసేనా? సందిగ్ధంలో కోచ్, కెప్టెన్
Jasprit Bumrah
Basha Shek
|

Updated on: Oct 01, 2022 | 1:30 PM

Share

మరో 15 రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ జట్ల వివరాలను ప్రకటించాయి. అలాగే పొట్టి ప్రపంచకప్‌ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో టీ20 మ్యాచ్‌లు ఆడుతూ తమ బలాలు, బలహీనతపై పునఃసమీక్ష చేసుకుంటున్నాయి. కాగా ఈటోర్నీలో ఆస్ట్రేలియా జట్టు డిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈసారి కూడా ఆ జట్టుకే వరల్డ్ కప్‌ నెగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్రికెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. హోం గ్రౌండ్‌ కావడం, భారీ హిట్లర్లు, నాణ్యత గల బౌలర్లు ఉండడం ఆసీస్‌కు లాభిస్తుందని జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉంటే మొన్నటివరకు పొట్టి ప్రపంచకప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా భావించిన భారత జట్లు ఇప్పుడు గందర గోళ పరిస్థితులతో సతమతమవుతోంది. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డ్యాషింగ్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కొన్ని రోజుల క్రితమే గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. తాజాగా యార్కర్ల కింగ్  బుమ్రా కూడా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి దూరమయ్యే సూచనలు  కనిపిస్తున్నాయి.

మొదట జడ్డూ.. ఇప్పుడు బుమ్రా

కాగా గతేడాది దుబాయి వేదికగా జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగింద భారత జట్టు. దీంతో ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టాలనుకుంది. అయితే ఉన్నట్లుండి టీమిండియాకు పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయాయి. ఆసియా కప్‌లో గాయపడిన రవీంద్ర జడేజా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతను ఆస్ట్రేలియా ఫ్లైట్‌ ఎక్కే అవకాశమే లేదు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ అదరగొడుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచి జడేజా లేని లోటు కనపడకుండా చేశాడు. కానీ ఆస్ట్రేలియాలోని సీమ్‌ పిచ్‌లపై అతను ఏ మేర రాణిస్తాడన్నది అనుమానమే. ఇక బుమ్రా విషయానికొస్తే.. గాయాల కారణంగా గత కొద్దికాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవల కోలుకుని ఆసీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లోకి బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో ఫించ్‌ ను బౌల్డ్‌ చేసి మళ్లీ మునపటి ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ చివరి టీ20 మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లలో 50కు పైగా పరుగులు సమర్పించుకుని తన బౌలింగ్‌ సామర్థ్యంపై అనుమానాలు పెంచాడు. బుమ్రా వైఫల్యానికి ప్రధాన కారణం అతనికి తగిన ప్రాక్టీస్ లేకపోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా సందిగ్ధమే!

ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో మొదటి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. కానీ ఆ ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. బుమ్రాకు గాయం తిరగబెట్టిందన్న వార్త టీమిండియా అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. అతనికి 4 నుంచి 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని, వరల్డ్‌కప్‌ ఆడే అవకాశాలు లేవని బీసీసీఐ అధికారు ఒకరు ప్రకటించారు. అసలే డెత్ ఓవర్ల సమస్యలతో సతమవుతోన్న టీమిండియాకు ఇది మరో ఎదురుదెబ్బగా పరిణమించింది. మరోవైపు వరల్డ్‌కప్‌లో స్టాండ్‌బై ప్లేయర్‌గా స్థానం దక్కించుకున్న సీనియర్‌ పేసర్‌ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం అతను కోలుకున్నా ఫిజికల్ టెస్టులో పాస్‌ అవ్వాల్సి ఉంది. అప్పుడే అతను ఆసీస్‌ ఫ్టైట్‌ ఎక్కనున్నాడు. మరోవైపు సౌతాఫ్రికాతో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకు హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే ఇది కేవలం సౌతాఫ్రికా సిరీస్‌ వరకు మాత్రమేనని తెలుస్తోంది. మరి ఇలాంటి సమయంలో ఆసీస్‌ విమానం ఎక్కే భారత బౌలర్ల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రాక్టీస్‌ లేమితో సతమతమవుతోన్న బుమ్రాను ప్రపంచకప్‌లో ఆడిస్తుందా? షమీని ఎలా వినియోగించుకుంటారు? లేక సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌లలో ఒకరిని వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేస్తారా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..