AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభమన్ గిల్.. ఒక టెస్ట్ మ్యాచ్‌లో 346 పరుగులతో కోహ్లీ రికార్డు బ్రేక్

శుభమన్ గిల్ ఇంగ్లాండ్‌పై ఎడ్జ్‌బాస్టన్‌లో 346* పరుగులతో ఒక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లీ కెప్టెన్సీ రికార్డును కూడా బద్దలు కొట్టి, సెనా దేశాల్లో 300+ పరుగులు చేసిన అరుదైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

Shubman Gill  : చరిత్ర సృష్టించిన శుభమన్ గిల్.. ఒక టెస్ట్ మ్యాచ్‌లో 346 పరుగులతో కోహ్లీ రికార్డు బ్రేక్
Shubman Gill
Rakesh
|

Updated on: Jul 05, 2025 | 8:25 PM

Share

Shubman Gill : క్రికెట్ అభిమానులంతా ఆశ్చర్యపోయే విధంగా టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ ఒక టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో గిల్, రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏకంగా 346 పరుగులు చేసి, భారత్ తరఫున ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్‌గా ఇంతటి భారీ స్కోరు చేయడం శుభమాన్ గిల్ కెరీర్‌లో ఒక మైలురాయి. గిల్ చేసిన 346* పరుగులు గతంలో దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు నెలకొల్పిన రికార్డులను కూడా దాటేశాయి. అంతేకాదు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చేసిన 293 పరుగుల రికార్డును కూడా గిల్ బద్దలు కొట్టాడు.

టెస్ట్ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో శుభమన్ గిల్ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌పై ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 346 పరుగులు* చేసి భారత టెస్ట్ క్రికెట్ దిగ్గజాలను అధిగమించాడు. ఈ జాబితాలో సునీల్ గావస్కర్ 1971లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో చేసిన 344 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ 2001లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాపై సాధించిన 340 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. అలాగే, సౌరవ్ గంగూలీ 2007లో బెంగళూరులో పాకిస్థాన్‌పై 330 పరుగులు చేయగా, వీరేంద్ర సెహ్వాగ్ రెండుసార్లు 300కు పైగా పరుగులు సాధించాడు. అతను 2008లో చెన్నైలో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు, 2004లో ముల్తాన్‌లో పాకిస్థాన్‌పై 309 పరుగులు చేశాడు.

భారత టెస్ట్ కెప్టెన్‌గా ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ఇంతకుముందు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ 2017లో శ్రీలంకతో ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో 293 పరుగులు చేసి ఆ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు ఆ రికార్డును శుభమన్ గిల్ అధిగమించాడు. ఇది భారత క్రికెట్‌లో యువ కెప్టెన్ల సామర్థ్యాన్ని చాటి చెబుతోంది. సెనా దేశాలు అంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఈ దేశాల్లోని కఠినమైన పిచ్‌లపై ఒక టెస్ట్ మ్యాచ్‌లో 300కు పైగా పరుగులు సాధించడం చాలా కష్టం. అయితే, టీంఇండియా కెప్టెన్ గిల్ ఈ అరుదైన ఘనతను సాధించిన మూడో ఆసియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు రాహుల్ ద్రావిడ్ 2003లో అడిలైడ్‌లో 305 పరుగులు, సచిన్ టెండూల్కర్ అదే సిరీస్‌లో సిడ్నీలో 301 పరుగులు చేశారు. ఇప్పుడు గిల్ కూడా ఈ అత్యుత్తమ జాబితాలో చేరి తన సత్తాను చాటుకున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..