జాతీయ జట్టులో చోటు దక్కలేదు.. అయినా రికార్డులకు దడ పుట్టించాడు.. ఈ భారత క్రికెటర్ ఎవరంటే.!
రికార్డులకు రారాజులు టీమిండియా బ్యాట్స్‌మెన్లు. నాటి నుంచి నేటి వరకు ఎందరో ప్లేయర్స్ ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టించారు...
రికార్డులకు రారాజులు టీమిండియా బ్యాట్స్‌మెన్లు. నాటి నుంచి నేటి వరకు ఎందరో ప్లేయర్స్ ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టించారు. అలాంటి ఓ రికార్డు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ భారత బ్యాట్స్‌మెన్ 366 పరుగులు చేశాడు. ఇతగాడు క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్ధుల వెన్నులో వణుకు పుట్టింది. టీమ్ స్కోర్ ఒక్క రోజులోనే 944 పరుగులు దాటింది. ఇంతటి ఘనత సాధించినా.. ఈ ప్లేయర్ టీమిండియా జాతీయ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. అతడే మాటూరి వెంకట శ్రీధర్. ఈరోజు ఆయన పుట్టినరోజు.
కుడిచేతి బ్యాట్స్‌మన్ అయిన శ్రీధర్ 1988-89 సీజనన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. దాదాపు 1999-2000 వరకు ఆడాడు. ఈ సమయంలో, అతను హైదరాబాద్ తరపున 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 6701 పరుగులు సాధించాడు. 48.91 సగటుతో 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు చేశాడు. మరోవైపు 35 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన శ్రీధర్ 29.06 సగటుతో 930 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతనికి సెంచరీ లేదు కానీ ఐదు అర్ధ సెంచరీలు బాదాడు.
ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లో శ్రీధర్ కూడా ఒకరు. ఇతడితో పాటు వీవీఎస్ లక్ష్మణ్, అబ్దుల్ అజీమ్ ఈ ఫీట్ సాధించారు. 1994లో ఆంధ్రాపై శ్రీధర్ 366 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇప్పటికీ ఇది మూడో అత్యధిక స్కోరు.
ట్రిపుల్ సెంచరీ సాధించి శ్రీధర్ చరిత్ర సృష్టించగా.. అతడు క్రీజులో ఉన్నప్పుడు జట్టు స్కోర్ శ్రీధర్ 850కి చేరింది. హైదరాబాద్ జట్టు స్కోర్ 30/1 ఉన్నప్పుడు శ్రీధర్ క్రీజులోకి వచ్చాడు. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడి 366 పరుగులు చేశాడు. ఇక అతడు అవుట్ అయినప్పటికీ.. హైదరాబాద్ ఐదు వికెట్లకు 880 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 944 పరుగులు చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఏ భారత జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇది.
కాగా, శ్రీధర్‌కు తన కెరీర్‌లో ఎప్పుడూ జాతీయ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, శ్రీధర్ మొదట హైదరాబాద్ క్రికెట్ కార్యదర్శిగా పని చేయగా.. 2008లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన భారత్‌కు మేనేజర్‌గా వ్యవహరించాడు. మంకీగేట్ వివాదాన్ని పరిష్కరించడంతో పాటు హర్భజన్ సింగ్‌ను శిక్ష నుండి రక్షించడంలో శ్రీధర్ కీలక పాత్ర పోషించాడు. ఎంవి శ్రీధర్ 2017లో చివరి శ్వాస విడిచారు.