MI vs LSG : ముంబై వర్సెస్ లక్నో.. వాంఖడేలో పరువు కోసం పోరాటం.. గెలుపు ఎవరిది?
MI vs LSG : ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు అత్యంత ఆసక్తికరమైన, నిర్ణయాత్మకమైన పోరు జరగనుంది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో ఓడిన జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్టే

MI vs LSG : ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు అత్యంత ఆసక్తికరమైన, నిర్ణయాత్మకమైన పోరు జరగనుంది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఈ రెండు జట్లకూ ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. అందుకే క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను ఒక ఎలిమినేషన్ వార్‌గా చూస్తున్నారు.
ముంబై ఇండియన్స్ పరిస్థితి ఈ సీజన్‌లో అత్యంత దారుణంగా ఉంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 గెలిచి, 7 ఓడిపోయి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. జట్టులో నిలకడ లేకపోవడం పెద్ద మైనస్. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ గాయంతో దూరమవ్వడం జట్టును బాగా దెబ్బతీసింది. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోవడం ముంబై ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కూడా ఏమీ మెరుగ్గా లేదు. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్న ఈ జట్టు, 8 మ్యాచ్‌ల్లో 6 ఓటములను చవిచూసింది. రిషబ్ పంత్ కెప్టెన్సీలో బౌలర్లు బాగానే రాణిస్తున్నా, బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. మొహ్సిన్ ఖాన్ వంటి బౌలర్లు శ్రమిస్తున్నా.. బ్యాటింగ్ లో ఎయిడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్ వంటి వారు ఆశించిన రీతిలో ఆడటం లేదు. గత సీజన్‌లలో మంచి రికార్డు ఉన్న లక్నో.. ఈసారి ఫామ్ కోల్పోయి తడబడుతోంది.
గణాంకాలను పరిశీలిస్తే లక్నో వైపే మొగ్గు కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో లక్నో ఏకంగా 6 సార్లు విజయం సాధించింది. ముంబై కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. విచిత్రమేమిటంటే ముంబై సొంత మైదానమైన వాంఖడేలో కూడా లక్నోదే పైచేయి కావడం విశేషం. అయితే ముంబై జట్టుకు వాంఖడేలో ఉండే క్రేజ్, అభిమానుల మద్దతు నేడు మ్యాచ్ ఫలితాన్ని మార్చవచ్చు.
ముంబై జట్టులో బుమ్రా బౌలింగ్, సూర్యకుమార్ బ్యాటింగ్ కీలకం కానున్నాయి. అటు లక్నో జట్టులో కెప్టెన్ రిషబ్ పంత్ మెరుపులు మెరిపిస్తేనే విజయం సాధ్యమవుతుంది. మహమ్మద్ షమీ, ఆవేష్ ఖాన్ వంటి బౌలర్లు ముంబై బ్యాటర్లను కట్టడి చేయాల్సి ఉంటుంది. ఎవరికి వారు సిద్ధంగా ఉన్నా, ఒత్తిడిని జయించిన జట్టుకే విజయం దక్కుతుంది. మరి ఈ సర్వైవల్ పోరులో ఎవరు నిలుస్తారో.. ఎవరు నిష్క్రమిస్తారో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
