AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : ఇండియా పాక్ పోరుకు ముందు క్రికెట్ దేవుడి ఎంట్రీ..మాస్టర్ మైండ్ నుంచి మాస్టర్ ప్లాన్

IND vs PAK : అండర్-19 వరల్డ్ కప్ 2026లో మరో మహా సంగ్రామం జరగబోతోంది. గ్రూప్-2 నుంచి సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకునేందుకు ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ అత్యంత కీలకమైన మ్యాచ్‌కు ముందు భారత కుర్రాళ్లకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రూపంలో ఒక గొప్ప బూస్టప్ లభించింది.

IND vs PAK : ఇండియా పాక్ పోరుకు ముందు క్రికెట్ దేవుడి ఎంట్రీ..మాస్టర్ మైండ్ నుంచి మాస్టర్ ప్లాన్
Ind Vs Pak (1)
Rakesh
|

Updated on: Jan 31, 2026 | 4:42 PM

Share

IND vs PAK : అండర్-19 వరల్డ్ కప్ 2026లో మరో మహా సంగ్రామం జరగబోతోంది. గ్రూప్-2 నుంచి సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకునేందుకు ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ అత్యంత కీలకమైన మ్యాచ్‌కు ముందు భారత కుర్రాళ్లకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రూపంలో ఒక గొప్ప బూస్టప్ లభించింది. పాకిస్థాన్‌తో తలపడబోయే ముందు ఒత్తిడిని ఎలా జయించాలో, విజయానికి కావాల్సిన మంత్రాలేంటో సచిన్ వీడియో కాల్ ద్వారా యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశారు.

అండర్-19 వరల్డ్ కప్ సూపర్-6లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు చేరుకోగా.. మిగిలిన ఒక్క స్థానం కోసం భారత్, పాక్ మధ్య పోటీ నెలకొంది. ఈ హై-ప్రెషర్ గేమ్‌కు ముందు బీసీసీఐ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వీడియో కాల్ ద్వారా మన యువ ఆటగాళ్లతో ముచ్చటించారు. కేవలం బ్యాటింగ్ టెక్నిక్ మాత్రమే కాకుండా, మానసికంగా ఎంత దృఢంగా ఉండాలి, క్రమశిక్షణ, వినయం విజయానికి ఎంత ముఖ్యమో తన అనుభవాలను పంచుకున్నారు.

భారత జట్టు ప్రస్తుతం 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. +3.337 భారీ నెట్ రన్ రేట్ టీమిండియాకు అతిపెద్ద బలం. పాకిస్థాన్ 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఒకవేళ ఆదివారం పాక్ గెలిచినా.. నెట్ రన్ రేట్‌లో భారత్‌ను అధిగమించడం వారికి చాలా కష్టం. కాబట్టి భారత్ కేవలం మ్యాచ్ గెలిస్తే చాలు, అధికారికంగా సెమీస్ బెర్తు దక్కుతుంది. సుమారు నెల రోజుల క్రితమే ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో, ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హాత్రే వంటి హిట్టర్లు తహతహలాడుతున్నారు.

సచిన్ తన మాటల్లో.. “గ్రౌండ్‌లో ప్రతి క్షణం ఏకాగ్రతతో ఉండటం ముఖ్యం. నైపుణ్యం ఉండటం ఒక ఎత్తు అయితే, దాన్ని క్రమశిక్షణతో ప్రదర్శించడం మరో ఎత్తు. భూమి మీద కాళ్ళు ఉంచి, వినయంగా ఉంటేనే క్రికెట్‌లో గొప్ప విజయాలు సాధించగలరు” అని కుర్రాళ్లకు హితబోధ చేశారు. సచిన్ వంటి లెజెండ్ నుంచి ఇలాంటి మాటలు వినడం తమకు వెలకట్టలేని అనుభవమని, ఇది తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని యువ ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ మ్యాచ్ ఫిబ్రవరి 1వ తేదీ (ఆదివారం) జింబాబ్వేలోని బులవాయో క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మీరు ఈ పోరును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. అలాగే జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. సెమీఫైనల్ బెర్తు కోసం జరుగుతున్న ఈ సమరంలో సచిన్ ఇచ్చిన గురుమంత్రం మన కుర్రాళ్లకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..