AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs RCB : మిచెల్ మార్ష్ సెంచరీ విధ్వంసం.. ఆర్‌సీబీపై 9 పరుగుల తేడాతో లక్నో అద్భుత విజయం

LSG vs RCB : ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టులో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆర్‌సీబీ బౌలర్లను ఉతికేస్తూ అద్భుతమైన సెంచరీతో జట్టు స్కోరును 209 పరుగులకు చేర్చాడు. అనంతరం ఛేజింగ్‌లో ఆర్‌సీబీకి లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ చుక్కలు చూపించాడు.

LSG vs RCB : మిచెల్ మార్ష్ సెంచరీ విధ్వంసం.. ఆర్‌సీబీపై 9 పరుగుల తేడాతో లక్నో అద్భుత విజయం
Lsg Vs Rcb
Rakesh
|

Updated on: May 08, 2026 | 6:39 AM

Share

LSG vs RCB : ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఎట్టకేలకు విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుణుడు మాటిమాటికీ అడ్డుపడినా, ఇరు జట్లు పరుగుల సునామీ సృష్టించడంతో అభిమానులకు అసలు సిసలు మజా దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఈ విజయం అత్యంత కీలకం. గత ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుస ఓటములతో కుంగిపోయిన లక్నో, తమ సొంత గడ్డపై ఏకానా స్టేడియంలో ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. చివరిసారిగా ఏప్రిల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై ఇక్కడ గెలిచిన లక్నో, అప్పటి నుంచి ఈ మైదానంలో ఓడిపోతూనే ఉంది. అయితే గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించి తమ ఓటముల రికార్డుకు పుల్‌స్టాప్ పెట్టింది. ఈ గెలుపుతో లక్నో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టులో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆర్‌సీబీ బౌలర్లను ఉతికేస్తూ అద్భుతమైన సెంచరీతో జట్టు స్కోరును 209 పరుగులకు చేర్చాడు. అనంతరం ఛేజింగ్‌లో ఆర్‌సీబీకి లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ చుక్కలు చూపించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని సున్నా పరుగులకే క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పేశాడు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత ప్రిన్స్ చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి టిమ్ డేవిడ్, క్రునాల్ పాండ్యా, రోమారియో షెపర్డ్ మెరుపులు మెరిపించి విజయం దిశగా నడిపించారు. ఒకానొక దశలో ఆర్‌సీబీ గెలిచేలా కనిపించింది. చివరి 6 బంతుల్లో బెంగళూరు విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. అంతకుముందు తన 3 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చిన దిగ్వేష్ రాఠీపై నమ్మకంతో కెప్టెన్ రిషబ్ పంత్ బంతిని అందించాడు. పంత్ నమ్మకాన్ని నిలబెడుతూ రాఠీ చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి లక్నోకు విజయాన్ని అందించాడు.

ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నప్పటికీ, తమ ఆశలను మాత్రం వదులుకోలేదు. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో ఉన్న లక్నో, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కూడా గెలిస్తే ప్లేఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు ఆర్‌సీబీ ఈ ఓటమితో టాప్ ప్లేస్‌కు వెళ్లే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. 12 పాయింట్లతో ఉన్న బెంగళూరుకు వచ్చే మ్యాచ్‌లు మరింత కీలకం కానున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us