AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. త్వరలో ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు!

రాష్ట్రంలోని గ్రామీన ప్రాంతాల ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. త్వరలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తూ, ఇంటివద్దకే ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు చేపడుతోంది. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్‌తో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిస్థాయి పేపర్‌లెస్ అడ్మినిస్ట్రేషన్‌ను వేగవంతం చేస్తోంది. అలాగే త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ వ్యవస్థలతో పాటు బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీని అందుబాటులోకి తీసుకురానుంది.

గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. త్వరలో ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు!
Telangana Digital Governance
Prabhakar M
| Edited By: |

Updated on: Aug 07, 2026 | 10:04 PM

Share

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పాలన అందించేందుకు త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. కేవలం ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేయడమే కాకుండా, నిర్ణయాల ప్రక్రియ నుంచి పౌర సేవల వరకు ఆధునిక సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

శుక్రవారం హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో గవ్ కనెక్ట్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీసేవ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన *“ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్ (తెలంగాణ)ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాలన కూడా అదే వేగంతో రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే సంప్రదాయ విధానాల నుంచి డిజిటల్ పాలన వైపు అడుగులు వేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బ్లాక్‌చెయిన్, డేటా అనలిటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ టెక్నాలజీల సహాయంతో ప్రభుత్వ నిర్ణయాలు మరింత వేగంగా, ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుందని, ప్రజలకు అందించే సేవలు కూడా మరింత సమర్థవంతంగా మారతాయని చెప్పారు.

తెలంగాణ ఇప్పటికే దేశంలో డిజిటల్ గవర్నెన్స్‌కు ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ క్యాబినెట్, 20 ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే రియల్‌టైమ్ గవర్నమెంట్ డ్యాష్‌బోర్డ్, దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్స్ఛేంజ్, వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవల డెలివరీ, మీ టికెట్ వంటి అనేక వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఈ సంస్కరణలతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుతున్నాయని వివరించారు.

పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని చెబుతూ.. త్వరలోనే బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. బ్లాక్‌చెయిన్ సాంకేతికత ద్వారా ప్రభుత్వ ధ్రువపత్రాల భద్రత మరింత బలోపేతం అవుతుందని, నకిలీ సర్టిఫికెట్లకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. ప్రజలు తమ ధ్రువపత్రాల ప్రామాణికతపై పూర్తి విశ్వాసం కలిగి ఉండేలా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అన్నారు.

డిజిటల్ సేవలు నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీ-ఫైబర్ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లోనూ నాణ్యమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఈ-గవర్నెన్స్ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు.

వృద్ధులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా సేవలను నేరుగా వారి ఇంటి వద్దకే అందించే విధంగా ప్రత్యేక డిజిటల్ సేవా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ సేవలను పొందేందుకు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సాంకేతికతను వినియోగిస్తామని చెప్పారు.

అదేవిధంగా డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పూర్తిస్థాయి పేపర్‌లెస్ అడ్మినిస్ట్రేషన్ వైపు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఫైళ్ల నిర్వహణ, అనుమతుల ప్రక్రియ, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలు పూర్తిగా డిజిటల్ విధానంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పరిపాలనా సామర్థ్యం కూడా పెరుగుతుందని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ సంస్కరణలన్నీ తెలంగాణను దేశంలోనే అత్యంత ఆధునిక డిజిటల్ గవర్నెన్స్ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సాంకేతికతను ప్రజల జీవితాలను సులభతరం చేసే సాధనంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us