IPL Auction 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ మాస్టర్ ప్లాన్.. ఆ ఆటగాడి కోసం ఏకంగా రూ. 25 కోట్లు..?
గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైన కేకేఆర్, ఈసారి వేలంలో భారీ మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేస్తూ, అభిషేక్ నాయర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించుకున్న ఈ ఫ్రాంచైజీ, వేలంలో ఐదుగురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసింది.

Kolkata Knight Riders: ఐపీఎల్ 2025 సీజన్‌లో నిరాశపరిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), 2026 సీజన్ కోసం సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైన కేకేఆర్, ఈసారి వేలంలో భారీ మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేస్తూ, అభిషేక్ నాయర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించుకున్న ఈ ఫ్రాంచైజీ, వేలంలో ఐదుగురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసింది.
కేకేఆర్ వద్ద ప్రస్తుతం అత్యధికంగా రూ. 64.3 కోట్ల భారీ పర్స్ అందుబాటులో ఉంది. ఈ డబ్బుతో జట్టును పటిష్టం చేసుకోవడానికి టార్గెట్ చేసిన 5గురు కీలక ఆటగాళ్లను ఓసారి చూద్దాం..
1. కామెరాన్ గ్రీన్ (Cameron Green): కేకేఆర్ చూపు ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ కామెరాన్ గ్రీన్‌పై ప్రధానంగా ఉంది. ఆండ్రీ రస్సెల్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాడిగా గ్రీన్‌ను భావిస్తున్నారు. ఇతని కోసం చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడాల్సి రావచ్చు. అవసరమైతే గ్రీన్ కోసం కేకేఆర్ ఏకంగా రూ. 25 కోట్లు వెచ్చించేందుకు కూడా వెనుకాడకపోవచ్చని సమాచారం.
2. జేమీ స్మిత్ (Jamie Smith): ఫిల్ సాల్ట్ జట్టును వీడిన తర్వాత, ఓపెనింగ్, వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగల ఆటగాడి కోసం KKR చూస్తోంది. ఇంగ్లాండ్‌కు చెందిన జేమీ స్మిత్ టీ20ల్లో 190కి పైగా స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. సునీల్ నరైన్‌కు జోడీగా ఇతను సరైన ఎంపిక అని భావిస్తున్నారు.
3. మతీషా పతిరానా (Matheesha Pathirana): ‘బేబీ మలింగ’గా పిలవబడే పతిరానాను చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసింది. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట అయిన పతిరానా కోసం కోల్‌కతా గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది.
4. మ్యాట్ హెన్రీ (Matt Henry): న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ కూడా కేకేఆర్ రాడార్‌లో ఉన్నాడు. అనుభవజ్ఞుడైన విదేశీ ఫాస్ట్ బౌలర్ కోటాలో ఇతన్ని తీసుకోవాలని చూస్తున్నారు. టీమ్ మెంటర్ టిమ్ సౌథీతో ఉన్న సాన్నిహిత్యం ఇక్కడ కలిసొచ్చే అంశం.
5. పృథ్వీ షా (Prithvi Shaw): ఇది కాస్త ఆశ్చర్యకరమైన పేరే అయినప్పటికీ, పవర్ ప్లేలో వేగంగా పరుగులు రాబట్టే పృథ్వీ షాపై కోచ్ అభిషేక్ నాయర్‌కు గురి ఉంది. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో పృథ్వీ షా మంచి ఫామ్‌లో ఉండటం కూడా ఇందుకు కారణం.
మొత్తానికి, వచ్చే వేలంలో రికార్డు స్థాయి ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో కామెరాన్ గ్రీన్ ఒకరు కావచ్చని, అతన్ని దక్కించుకోవడానికి కేకేఆర్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.




