KL Rahul : నువ్వు నాతో మాట్లాడొద్దు.. కేఎల్ రాహుల్ – అంపైర్ మధ్య మాటల యుద్ధం
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో మైదానంపై వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీమిండియా వైస్-కెప్టెన్ కేఎల్ రాహుల్, అంపైర్ కుమార్ ధర్మసేన మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అసలు ఈ వివాదం ప్రసిద్ధ కృష్ణ, జో రూట్ మధ్య మాటల యుద్ధంతో మొదలైంది.

KL Rahul : ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో మైదానంపై వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసలు మూడో టెస్టు మ్యాచ్ నుంచి ఇరు జట్ల మధ్య ఎప్పుడూ ఏదో ఒక చిన్నపాటి వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. అదే విధంగా ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో, ఒక చిన్న ఘటన ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పెద్ద వాదనకు దారితీసింది. భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అంపైర్ కుమార్ ధర్మసేన మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ సమయంలో 22వ ఓవర్లో భారత యువ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, బ్యాట్స్‌మెన్ జో రూట్‌కి బౌన్సర్ వేశాడు. ఆ బంతి తర్వాత, ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రూట్, ప్రసిద్ధ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి ఏదో కామెంట్ చేశాడు. దీనికి ప్రసిద్ధ్ కూడా మళ్లీ బదులిచ్చాడు. ఈ వివాదం పెరుగుతున్నదని గ్రహించిన అంపైర్ కుమార్ ధర్మసేన జోక్యం చేసుకుని, ప్రసిద్ధ్ కృష్ణను హెచ్చరించారు. ఈ సంఘటన తర్వాత, ప్రసిద్ధ్ తో పాటు రూట్‌ని హెచ్చరించనందుకు కేఎల్ రాహుల్ అంపైర్ ధర్మసేనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రాహుల్, అంపైర్‌ను “మేము ఏం కావాలనుకుంటున్నారు? ఏమి మాట్లాడకుండా సైలెంట్‌గా ఆడాలా?” అని ప్రశ్నించాడు. దీనికి అంపైర్, “మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, బౌలర్ వచ్చి మిమ్మల్ని ఏదైనా అంటే, అది మీకు నచ్చుతుందా? అందుకే ఇలా చేయొద్దు.” అని రాహుల్‌కి చెప్పాడు. దీనికి రాహుల్, “అంటే మేము కేవలం బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లాలా?” అని తిరిగి ప్రశ్నించాడు. దీంతో అంపైర్ ధర్మసేన తీవ్రమైన స్వరంతో, “మ్యాచ్ అయిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. నాతో ఈ విధంగా మాట్లాడకూడదు” అని అన్నారు.
ఈ ఘటన తరువాత కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణలపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఐసీసీ నియమాల ప్రకారం, అంపైర్‌తో వాదించడం అనేది లెవెల్-1 లేదా లెవెల్-2 నేరంగా పరిగణించవచ్చు. దీనికి ఆటగాళ్లకు జరిమానా, డిమెరిట్ పాయింట్లు, భవిష్యత్తు మ్యాచ్‌లలో నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే, ఇప్పటివరకు అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీ నుండి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




