AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరుణ్‌ నాయర్‌.. చావును జయించి, రాజకీయాలకు బలయ్యాడా? కోహ్లీ, రోహిత్‌ని మించి స్టార్‌ అవ్వాల్సినోడు!

కరుణ్ నాయర్, 2016లో ఇంగ్లాండ్‌తో టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అనంతరం టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025లో తిరిగి రావడంతో, అతని ప్రతిభకు మళ్ళీ అవకాశం లభించింది. అయితే.. చావును కూడా జయించి.. క్రికెట్ పాలిటిక్స్ బలయ్యాడనే భావిస్తున్న ఈ క్రికెటర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం..

కరుణ్‌ నాయర్‌.. చావును జయించి, రాజకీయాలకు బలయ్యాడా? కోహ్లీ, రోహిత్‌ని మించి స్టార్‌ అవ్వాల్సినోడు!
Karun Nair
Follow us
SN Pasha

|

Updated on: Apr 14, 2025 | 7:59 PM

పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్‌ గుర్తుందా..? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరినే ఊడ్చేసింది. కానీ, వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫానూ కడగలేకపోయింది. ఇట్‌ వాజ్‌ ఏ ఫ్రికింగ్‌ బ్లడ్‌ బాత్‌” అన్నట్లు.. గత పదేళ్లుగా ఎంతో మంది క్రికెటర్లు వచ్చారు.. కానీ, కరుణ్‌ నాయర్‌ నెలకొల్పిన రికార్డును మాత్రం.. ఇప్పటికీ ఏ క్రికెటర్‌ కూడా కొట్టలేకపోయాడు. ఇట్‌ వాజ్‌ ఏ ఫ్రికింగ్‌ బ్లడ్‌ బాత్‌. ఈ డైలాగ్‌ గుర్తుంచుకోండి మాట్లాడుకుందాం..

కరుణ్‌ నాయర్‌.. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆదివారం జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ తర్వాత చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు. ఇదే పేరు 9 ఏళ్ల క్రితం.. ఇండియన్‌ క్రికెట్‌లో, కాదు.. కాదు.. ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోయిందనే విషయం మీకు తెలుసా? ఆ టైమ్‌లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మను కూడా ఈ కుర్రాడు మించిపోతాడేమో అని చాలా మంది అనుకున్నారు, కొంత మంది భయపడ్డారు కూడా. అంతలా తన బ్యాటింగ్‌ విధ్వంసంతో టీమిండియాకు మరో స్టార్‌ దొరికాడని అనిపించేలా చేశాడు. కానీ, అనూహ్యంగా కొన్ని రోజులగే టీమిండియాలో కనిపించకుండా పోయాడు. కట్‌ చేస్తే.. దేశవాళి క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఐపీఎల్‌లోకి కొన్నేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే.. “అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే..” డైలాగ్‌ను గుర్తుకు తెచ్చాడు. అసలు ఎవరీ కరుణ్‌ నాయర్‌.. ఎందుకు ఒక్క మంచి ఇన్నింగ్స్‌తోనే ఇతని పేరు ఇంతలా వినిపిస్తోంది. తెలుసుకుందాం.. ఇవాళ్టి అన్‌టోల్డ్‌ స్టోరీస్‌లో.

1991 డిసెంబర్‌ 6న రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో కళాధరన్‌ నాయర్‌, ప్రేమ నాయర్‌ దంపతులకు జన్మించాడు కరుణ్‌ నాయర్‌. పుట్టింది రాజస్థాన్‌లో అయినా.. నాయర్‌ కర్ణాటకకు చెందిన ఆటగాడు. అతని కుటుంబం కర్ణాటకలోనే స్థిరపడిపోయింది. తండ్రి ఓ చిన్న బిజినెస్‌మెన్‌, తల్లి టీచర్‌. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం. అయితే.. కరుణ్‌ నాయర్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి ఇష్టం. ఆ ఇష్టంతోనే క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకున్నాడు. ఎంతో కష్టపడుతూ.. కర్ణాటక తరఫున అండర్‌ 15, అండర్‌ 19 ఆడుతూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. 2012లో విజయ్‌ హజరే ట్రోఫీ ఆడే అవకాశం కొట్టేశాడు. ఆ తర్వాత 2013లో కర్ణాటక స్టేట్‌ టీమ్‌ తరఫున రంజీ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

2013-14 రంజీ సీజన్‌లో కర్ణాటక తరఫున మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడాడు. కానీ, తొలి మూడు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కానీ, ఆ తర్వాత వరుసగా మూడు సెంచరీలు బాదేశాడు. అది కూడా క్వార్టర్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. దాంతో కర్ణాటక రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తంగా ఆ రంజీ సీజన్‌లో 61.75 యావరేజ్‌తో 494 పరుగులు సాధించాడు. ఇక వెంటనే 2013లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కరున్‌ నాయర్‌ను తమ టీమ్‌లోకి తీసుకుంది. ఆ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం నాయర్‌కు వచ్చింది. కానీ, 2014 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ నాయర్‌ను రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. తనకు చెల్లించిన ధరకు న్యాయం చేస్తూ.. 11 మ్యాచ్‌ల్లో 142.24 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు సాధించాడు.

అదే ఫామ్‌ను 2014-15 రంజీ సీజన్‌లోనూ కొనసాగించాడు. 47.26 యావరేజ్‌తో 700 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. డొమెస్టిక్‌ క్రికెట్‌లో మనోడి ప్రదర్శన చూసి.. టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. జూన్‌లో భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆడిన నాయర్‌ పెద్దగా రాణించలేదు. తొలి వన్డేలో 7, రెండు వన్డేలో 39 రన్స్‌ మాత్రమే చేశాడు. కానీ, తన సొంత స్టేట్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం ఆ సిరీస్‌లో అదరగొట్టాడు. సరే పెద్దగా రాణించకపోయినా టీమిండియాలో ఆడే ఛాన్స్‌ రావడంతో నాయర్‌ హ్యాపీగా ఉన్నాడు. కానీ, ఆ నెక్ట్స్‌ మంత్‌లోనే నాయర్‌ జీవితంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. అద్భుతంగా ఆడుతూ టీమిండియాకు ఎంపిక అయ్యాడో లేదో ఒక పెను ప్రమాదానికి గురయ్యాడు.

నిజానికి చావు అంచల వరకు వెళ్లొచ్చి.. ఒక రకంగా పునర్జన్మ పొందాడు. 2016 జులైలో కేరళలో 100 మందితో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురై పంబా నదిలో ముగినిపోయింది. ఆ ప్రమాదంలో చాలా మంది గల్లంతయ్యారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అదే బోటులో కరుణ్‌ నాయర్‌ కూడా ఉన్నాడు. కానీ, అదృష్టం కొద్ది రెస్క్యూ టీమ్‌ సమయానికి చేరుకోవడంతో కరుణ్‌ నాయర్‌ను రక్షించగలిగారు. ఆ పెను ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా నవంబర్‌ 26న జరిగిన మూడో టెస్ట్‌తో కరుణ్‌ నాయర్‌కు టెస్ట్‌ మ్యాచ్‌ ఆడే ఛాన్స్‌ వచ్చింది. కానీ, ఆ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చినా.. పెద్దగా రాణించలేదు.

ఆ తర్వాత అజింక్యా రహానె గాయపడటంతో.. చివరి రెండు టెస్టుల్లోనూ నాయర్‌కు అవకాశం దక్కింది. నాలుగో టెస్టులోనూ ఫెయిల్‌ అయ్యాడు. కానీ, చివరిదైన ఐదో టెస్టులో కరుణ్‌ నాయర్‌ సత్తా ఏంటో బయటపడింది. విరాట్‌ కోహ్లీ, పుజారా లాంటి వాళ్లు విఫలమైన పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 303 పరుగులు సాధించాడు. 381 బంతుల్లో 34 ఫోర్లు, 4 సిక్సులతో చరిత్ర సృష్టించాడు. ఆడుతున్న మూడో మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. వీరేందర్‌ సెహ్వాగ్‌ తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్‌. ఇన్‌ఫ్యాక్ట్‌.. టీమిండియా తరఫున ట్రిపుల్‌ సెంచరీ చేసిన యంగెస్ట్‌ బ్యాటర్‌. పాతికేళ్ల వయసులోనే టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీతో ఇంగ్లండ్‌ బౌలర్లను ఊచకోత కోయడంతో కరుణ్‌ నాయర్‌ పేరు మారుమోగిపోయింది. మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నట్లు.. కరుణ్‌ నాయర్‌ సృష్టించిన ఈ రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేకపోయారు.

ఆ ఇన్నింగ్స్‌ తర్వాత ఇక టీమిండియాకు మరో స్టార్‌ దొరికేశాడంటూ అంతా మెచ్చుకున్నారు. కానీ, ఆ తర్వాత ఓ మూడు టెస్టులు ఆడి.. కరుణ్‌ నాయర్‌ కనిపించకుండా పోయాడు. మూడో టెస్టులోనే ట్రిపుల్‌ సెంచరీ బాదిన ఆటగాడు.. ఓ మూడు టెస్టులు సరిగ్గా ఆడకపోయే సరికి అతన్ని పక్కపెట్టేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు టీమిండియాలోకి రానివ్వలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా డొమెస్టిక్‌ క్రికెట్‌లో రాణిస్తూనే ఉన్నాడు. “డియర్‌ క్రికెట్‌.. గివ్‌ మీ వన్‌ మోర్‌ ఛాన్స్‌” అంటూ తన ఆటను వేడుకున్నాడు. అనుకున్నట్లే.. డొమెస్టిక్‌ క్రికెట్‌లో సూపర్ ఫామ్‌, ఇప్పుడు ఐపీఎల్‌ 2025తో అతనికి మరో అవకాశం వచ్చింది. దాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు.

సూపర్‌ ఇన్నింగ్స్‌తో మరోసారి కరుణ్‌ నాయర్‌ అంటే ఏంటో చూపించాడు. బట్‌.. మ్యాచ్‌ గెలిపించి ఉంటే ఇంకా బాగుండేది. ఢిల్లీ మ్యాచ్‌ ఓడిపోయినప్పటికీ.. కరుణ్‌ నాయర్‌ ఆడిన ఇన్నింగ్స్‌, అతని కమ్‌ బ్యాక్‌ ఎప్పటికీ క్రికెట్‌ అభిమానులకు గుర్తుండి పోతుంది. కరుణ్‌ నాయర్‌ లాంటి ఒక టాలెంటెడ్‌ ప్లేయర్‌కు మరికొన్ని అవకాశాలు ఇస్తే బాగుంటేదనే అభిప్రాయం ఇప్పటికీ చాలా మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ నుంచి వినిపిస్తుంది. క్రికెట్‌ పాలిటిక్స్‌కు అతను బలయ్యాడనే ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ.. గతం గడిచిపోయింది. అయితే మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి.. తన క్రికెట్‌ జీవితానికి కరుణ్‌ నాయర్‌ మంచి ముగింపు పలకాలని కోరుకుందాం.. ఆల్‌ ది బెస్ట్‌ టూ కరుణ్‌ నాయర్‌.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..