Jasprit Bumrah : కపిల్ దేవ్‌ను దాటేసి కొత్త చరిత్ర సృష్టించిన బుమ్రా.. వచ్చాడంటే ‘పాంచ్’ పడాల్సిందే
లార్డ్స్ టెస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీసి కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. విదేశీ గడ్డపై అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ను 387 పరుగులకే కట్టడి చేసిన భారత్, బ్యాటింగ్‌లో తడబడింది.

Jasprit Bumrah : లార్డ్స్ టెస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా భారత ఫాస్ట్ బౌలర్లకు ఇప్పటివరకు కలలో కూడా సాధ్యం కాని దాన్ని నిజం చేశాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా రెండో టెస్ట్‌కు దూరంగా ఉన్న బుమ్రా, మూడో టెస్ట్ రెండో రోజు ఉదయం బంతి పట్టుకోగానే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లపై సునామీలా విరుచుకుపడ్డాడు. అతను ఈ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడమే కాకుండా దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి, జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్‌లో 15వ ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే.. ఇది విదేశీ గడ్డపై బుమ్రా 13సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనతను సాధించాడు. దీంతో అతను కపిల్ దేవ్‌ను వెనక్కి నెట్టాడు. కపిల్ దేవ్ పేరు మీద 12 సార్లు ఐదు వికెట్లను తీసిన ఘనత సాధించిన రికార్డు ఉంది. ఇప్పుడు బుమ్రా విదేశీ గడ్డపై అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
విదేశీ గడ్డపై అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన వారిలో జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేసులో ఉన్నాడు. బుమ్రా తర్వాతి స్థానంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఉన్నాడు. అతను విదేశీ గడ్డపై 12 సార్లు ఐదు వికెట్లు తీశాడు. మూడో స్థానంలో భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన అనిల్ కుంబ్లే నిలిచాడు.. తను 10 సార్లు ఈ ఫీట్‌ను నమోదు చేసుకున్నాడు. ఇక నాలుగో స్థానంలో టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఉన్నాడు. అతను 9 సార్లు ఈ ఘనతను సాధించాడు.
లార్డ్స్ మైదానంలో ఏదో ఒక రికార్డును తమ పేరు మీద నమోదు చేసుకోవాలని ప్రతి క్రికెటర్ కలలు కంటారు. కానీ బుమ్రా ఈ మైలురాయిని చేరుకున్న తర్వాత కూడా చాలా సైలెంటుగా కనిపించాడు. శుక్రవారం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా తన స్పెల్‌లో జోఫ్రా ఆర్చర్‌ను అవుట్ చేసి అతను ఐదు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అది బుమ్రాకు ఆ ఉదయం లభించిన నాలుగో వికెట్. తన అద్భుతమైన బౌలింగ్ సాయంతో భారత్ ఇంగ్లాండ్‌ను 387 పరుగులకే కట్టడి చేసింది.రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులతో ముందుకు సాగింది. జామీ స్మిత్, బ్రైడాన్ కార్స్ హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల ముందు తడబడింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




