Jasprit Bumrah: బుమ్రాకు ఏమైంది? వెలుగులోకి షాకింగ్ విషయం.. టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ?
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో ఆందోళన వాతావరణం నెలకొంది. జస్ప్రీత్ బుమ్రా గాయాన్ని చూసిన వైద్యులు షాకింగ్ రిపోర్టు ఇచ్చారని సమాచారం. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 32 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు బుమ్రా.
ఆస్ట్రేలియా టూర్‌లో వెన్నునొప్పితో బాధపడిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మొదట్లో బుమ్రా కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటాడని, ఆ తర్వాత జట్టులోకి వస్తాడని చెప్పుకొచ్చారు. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉండడని, అతను కోలుకోవడానికి మరికొద్ది రోజులు అవసరం అని వార్తలు వచ్చాయి. అయితే పరిస్థితి అలా లేదని తెలుస్తోంది. బుమ్రాకు వెన్ను నొప్పి తీవ్రంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ టీమిండియా స్టార్ బౌలర్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. జస్ప్రీత్ బుమ్రా గాయం తీవ్రంగా ఉంది. వచ్చే వారం అతను బెంగుళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే బుమ్రా వెళ్లే తేదీ ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి అప్పటి వరకు ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకోవాలని బుమ్రాకు డాక్టర్ సలహా ఇచ్చారు. బుమ్రా వీపు కింది భాగంలో వాపు తగ్గలేదు. అది తగ్గిన తర్వాతే చికిత్స అందించాలనే విషయంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం అసాధ్యమని చెబుతున్నారు. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా అతనిని తిరిగి తీసుకురావడానికి బీసీసీఐ కూడా తొందరపడటం లేదు. బుమ్రా గాయం చాలా తీవ్రంగా ఉంది, అతను ఎప్పుడు మైదానంలోకి వస్తాడో చెప్పలేమని తెలుస్తోంది. ఒక వేళ బుమ్రాకు మళ్లీ శస్త్రచికిత్స అవసరమైతే, అతను మళ్లీ క్రికెట్‌లోకి రావడానికి చాలా సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
అదే జరిగితే..
నిజానికి బుమ్రా చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అదే గాయం కారణంగా బుమ్రా ముందుగా భారత జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అందుకే సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కోలుకుని జట్టులోకి వచ్చిన బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే సిరీస్ చివరి టెస్టులో వెన్నునొప్పి రావడంతో మైదానం వీడాడు. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రాను ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాలని కోరితే, అతడు ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌లో నేరుగా టెస్టులు ఆడే అవకాశం ఉంది. అయితే జస్‌ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే టీమ్‌ఇండియా భారీ ఎదురు దెబ్బ తగిలినట్టే. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి