National Sports Awards 2024: నేషనల్ అవార్డ్స్‌లో క్రికెట్‌కు మొండిచేయి.. ఆ ఇద్దరి విషయంలో నెటిజన్ల ఫైర్..
కేంద్రం ప్రకటించిన క్రీడా అవార్డుల్లో జస్‌ప్రీత్ బుమ్రా, రాహుల్ ద్రవిడ్‌లకు చోటు దక్కకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. బుమ్రా 2024లో అద్భుత ప్రదర్శన కనబరిచినా, ఖేల్ రత్నకు ఎంపిక కాలేదు. రాహుల్ ద్రవిడ్ టీమిండియాను 2024 టీ20 ప్రపంచకప్ లో జైత్రయాత్ర దిశగా నడిపించినప్పటికీ, ద్రోణాచార్య అవార్డుకు ఎంపికవ్వలేదు. ఈ నిర్ణయంపై క్రీడాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారాల ప్రకటన ఈసారి తీవ్ర విమర్శలకు దారితీసింది. జస్‌ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజ క్రికెటర్‌ను, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను అవార్డుల జాబితాలో చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా సుదీర్ఘ కాలం తర్వాత విజయం సాధించినప్పటికీ, ఈ విజయానికి మార్గదర్శకత్వం వహించిన క్రికెటర్లు, కోచ్‌లు ప్రభుత్వ అవార్డులలో చోటు దక్కించుకోకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
ఇక 17 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, టెస్ట్, టీ20 ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనతో అలరించాడు. 2024లో టెస్టుల్లో 71 వికెట్లు, టీ20 ప్రపంచకప్‌లో 15 వికెట్లు పడగొట్టిన అతని ప్రదర్శన అంతా మేటి. అయినప్పటికీ, అతని పేరు ఖేల్ రత్న పురస్కార జాబితాలో లేకపోవడం అభిమానుల నిరసనకు దారితీసింది.
అదే విధంగా, టీమిండియా విజయం వెనుక సారథ్యం వహించిన రాహుల్ ద్రవిడ్‌కు ద్రోణాచార్య అవార్డ్ ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా బలమైన జట్టుగా తిరిగి పునరుద్ధరించబడింది. కానీ ప్రభుత్వ నిర్ణయంపై క్రీడా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
అర్జున అవార్డుల జాబితాలో 32 మంది ఆటగాళ్లకు స్థానం కల్పించినప్పటికీ, క్రికెటర్లను పూర్తిగా విస్మరించారు. ఇది కేవలం క్రికెట్ అభిమానులను మాత్రమే కాదు, క్రికెట్ సంఘాలకూ నిరాశను కలిగించింది. బీసీసీఐ క్రీడా పురస్కారాలకు క్రికెటర్ల పేర్లను సిఫారసు చేయకపోవడం వెనుక ఉన్న కారణాలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.