Chennai Super Kings : రూ.37 లక్షల నష్టం వచ్చినా పర్లేదు.. ధోనీ టీమ్ కోసం ఆస్ట్రేలియా పేసర్ త్యాగం
Chennai Super Kings : ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూ. 37 లక్షల నష్టాన్ని భరించి ఐపీఎల్ 2026లో సీఎస్‌కే జట్టులో చేరాడు. పీఎస్ఎల్ వదులుకుని ధోనీ సేనలో చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న జాన్సన్ గతంలో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.

Chennai Super Kings : ఐపీఎల్ (IPL) అంటే కేవలం భారతీయులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు ఒక కల. గత 18 ఏళ్లుగా ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు ఈ లీగ్ ద్వారా స్టార్‌లుగా ఎదిగారు. కోట్లలో సంపాదన, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుండటంతో ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ ఆడినా చాలనుకునే వారు ఎందరో ఉన్నారు. అయితే, ఒక ఆస్ట్రేలియా ఆటగాడు మాత్రం ఐపీఎల్ కోసం ఏకంగా లక్షల రూపాయల నష్టాన్ని భరించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ ఆటగాడే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మేనేజ్‌మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానంలో మరో ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను జట్టులోకి తీసుకుంది. మంగళవారం మార్చి 24న ఐపీఎల్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. పొడవైన ఆకారం, గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న జాన్సన్ గతంలో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.
ఈ డీల్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. సీఎస్‌కే కోసం సంతకం చేయడం వల్ల స్పెన్సర్ జాన్సన్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. వాస్తవానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL 2026) కోసం క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు జాన్సన్‌ను 5.6 కోట్ల పాకిస్థానీ రూపాయలకు (సుమారు రూ.1.87 కోట్లు) ఒప్పందం చేసుకుంది. అయితే ఐపీఎల్ నుంచి పిలుపు రావడంతో ఆయన పీఎస్ఎల్ నుంచి తప్పుకున్నాడు. సీఎస్‌కే ఆయనను కేవలం రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌కే సైన్ చేసింది. అంటే ఐపీఎల్ ఆడటం కోసం ఆయన సుమారు రూ.37 లక్షల ఆదాయాన్ని వదులుకున్నాడన్నమాట.
ఎందుకీ రిస్క్?
డబ్బు తక్కువైనా ఐపీఎల్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఈ లీగ్ ఇచ్చే ఎక్స్‌పోజర్. పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షిస్తారు. పైగా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి సక్సెస్‌ఫుల్ టీమ్ లో ఆడటం వల్ల తన కెరీర్ మరింత పుంజుకుంటుందని జాన్సన్ భావిస్తున్నాడు. ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజం నీడలో ఆడటం ద్వారా లభించే అనుభవం రూ.37 లక్షల కంటే ఎంతో విలువైనదని ఆయన నిర్ణయం చెబుతోంది. పైగా వచ్చే ఏడాది మెగా వేలం లాంటివి ఉంటే, సీఎస్‌కేలో మంచి ప్రదర్శన ఇస్తే తన డిమాండ్ రెట్టింపు అవుతుందని ఆయన ఆశ.
సీఎస్‌కే బౌలింగ్ విభాగం బలోపేతం
స్పెన్సర్ జాన్సన్ రాకతో సీఎస్‌కే బౌలింగ్ ఎటాక్ మరింత పటిష్టంగా మారింది. ముఖ్యంగా ఎడమ చేతి వాటం బౌలర్ కావడంతో ఆయన పవర్ ప్లే, డెత్ ఓవర్లలో వైవిధ్యాన్ని చూపగలడు. మతీషా పతిరానా, దీపక్ చాహర్ వంటి బౌలర్లతో కలిసి జాన్సన్ ప్రత్యర్థులను కట్టడి చేయనున్నాడు. చెన్నై పిచ్ స్లోగా ఉన్నప్పటికీ, జాన్సన్ తన హైట్ అడ్వాంటేజ్‌తో అదనపు బౌన్స్‌ను రాబట్టగలడు. మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో జాన్సన్ తన మొదటి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.
