IPL Brand Value: 20+ బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా ఐపీఎల్.. ప్రపంచ క్రీడా రంగంలోనే తోపు..
IPL Brand Value 2026: కేవలం వినోదాన్నే కాకుండా వ్యాపార పరంగానూ ఐపీఎల్ అద్భుతాలు సృష్టిస్తోంది. మున్ముందు ఈ లీగ్ గ్లోబల్ క్రీడా సామ్రాజ్యంలో ఎన్ఎఫ్ఎల్ స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ 20 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కేవలం ఆరంభం మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

IPL Brand Value 2026: క్రికెట్ పండుగ అంటేనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). 17 ఏళ్ల కిందట మొదలైన ఈ లీగ్ ఇప్పుడు ప్రపంచ క్రీడా ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడా టోర్నీల్లో ఒకటిగా నిలిచిన ఐపీఎల్, వ్యాపార విలువలో 20 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది.
రూ. లక్ష కోట్ల వ్యాపార సామ్రాజ్యం..
ఐపీఎల్ కేవలం రెండు నెలల క్రికెట్ వినోదం మాత్రమే కాదు, అదొక లాభదాయకమైన వ్యాపార నమూనాగా రూపాంతరం చెందింది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన హౌలిహాన్ లోకీ (Houlihan Lokey) తాజాగా విడుదల చేసిన ‘2026 ఐపీఎల్ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ’ నివేదిక కళ్లు చెదిరే వాస్తవాలను వెల్లడించింది. 2026 సీజన్ ముగిసే సమయానికి ఐపీఎల్ బిజినెస్ వాల్యూ (వ్యాపార విలువ) ఏకంగా 11.4 శాతం పెరిగి 20.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.97 లక్షల కోట్లు) చేరుకుంది. కేవలం స్టాండ్-అలోన్ బ్రాండ్ వాల్యూనే 10.3 శాతం వృద్ధితో 4.3 బిలియన్ డాలర్ల (రూ. 41,388 కోట్లు) మార్కును తాకింది. 2023 నుంచి ఐపీఎల్ తన బ్రాండ్ వాల్యూకు 1.1 బిలియన్ డాలర్లకు పైగా జత చేయడం విశేషం. ఒక్కో మ్యాచ్ విలువను లెక్కిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కంటే అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ ‘ఎన్ఎఫ్ఎల్’ (NFL) మాత్రమే ముందుంది.
రికార్డు ధరకు ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్..
ఐపీఎల్ టీమ్‌ల కొనుగోలుకు ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఏడాది జరిగిన రెండు అతిపెద్ద ఫ్రాంచైజీ లావాదేవీలు మార్కెట్ అంచనాలను తలకిందులు చేశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని బ్లాక్‌స్టోన్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్‌తో కూడిన కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 15,000 కోట్లు) దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఫ్రాంచైజీకి ఇదే అత్యధిక ధర. అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టును మిట్టల్ కుటుంబం, అదార్ పూనావాలా 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ భారీ డీల్స్ ఐపీఎల్‌పై అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని సూచిస్తున్నాయి.
అగ్రస్థానంలో ఆర్సీబీ.. 300 మిలియన్ డాలర్ల క్లబ్‌లో ఎంట్రీ..
తాజా నివేదిక ప్రకారం ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ ర్యాంకింగ్స్‌లో ఆర్సీబీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025లో 269 మిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ, 16 శాతం పెరిగి ఏకంగా 312 మిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఘనత సాధించడం ద్వారా 300 మిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి ఐపీఎల్, తొలి క్రికెట్ జట్టుగా ఆర్సీబీ సరికొత్త చరిత్ర లిఖించింది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై ఇండియన్స్ (264 మిలియన్ డాలర్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (245 మిలియన్ డాలర్లు), చెన్నై సూపర్ కింగ్స్ (244 మిలియన్ డాలర్లు) నిలిచాయి.
డిజిటల్ విప్లవం.. స్మార్ట్ టీవీల హవా..
ప్రేక్షకుల వీక్షణ అలవాట్లలో వస్తున్న మార్పులను ఐపీఎల్ 2026 సీజన్ స్పష్టంగా చూపించింది. సాంప్రదాయ కేబుల్ టీవీల (లైనర్ టీవీ) రేటింగ్స్ 18.8 శాతం పడిపోగా, కనెక్టెడ్ టీవీల (స్మార్ట్ టీవీలు) వ్యూయర్‌షిప్ ఏకంగా 26 శాతం పెరిగింది. జియోస్టార్ అందించిన డేటా ప్రకారం, 2026 సీజన్ ఏకంగా 1.06 బిలియన్ స్క్రీన్లకు చేరుకుంది. ఈ డిజిటల్ జోరుతో లీగ్ మొత్తం ఆదాయం 1.8 బిలియన్ డాలర్లను అధిగమించింది. ఈ పరిణామంతో స్పాన్సర్‌షిప్ విధానాల్లో కూడా మార్పులొచ్చాయి. గూగుల్ జెమినీ లాంటి టెక్ దిగ్గజాలతో ఐపీఎల్ చేసుకున్న ఒప్పందాలు లీగ్ స్థాయిని మరింత పెంచాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




