AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీటిలో చికెన్, మటన్ కంటే 5 రెట్లు ఎక్కువ శక్తి, ప్రోటీన్.. కండపుష్టికి, బలానికి తప్పనిసరిగా తినండి..

శరీర నిర్మాణం, కండరాల బలం, కణాల పెరుగుదల, రోగనిరోధక వ్యవస్థకు ప్రోటీన్లు ఎంతో అవసరం. మాంసాహారం మాత్రమే కాకుండా సోయాబీన్లు, పప్పులు, పెసలు, మినుములు, రాజ్మా, వేరుశనగలు, బాదం వంటి శాఖాహారాల్లోనూ ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. రోజువారీ ప్రోటీన్ అవసరం వయస్సు, బరువు, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే.. సరిన విధంగా సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం.

వీటిలో చికెన్, మటన్ కంటే 5 రెట్లు ఎక్కువ శక్తి, ప్రోటీన్.. కండపుష్టికి, బలానికి తప్పనిసరిగా తినండి..
Protein Rich Vegetarian Foods
Shaik Madar Saheb
|

Updated on: Sep 28, 2026 | 12:05 PM

Share

మన శరీర నిర్మాణానికి ప్రోటీన్లు (మాంసకృత్తులు) ఇటుకల వంటివి. ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎంత ముఖ్యమో.. మన శరీరం పెరగడానికి, దృఢంగా ఉండటానికి ప్రోటీన్లు అంత అవసరం.. అందుకోసమే వైద్య నిపుణులు.. ప్రోటీన్ ఉన్న ఆహారాలను తప్పనిసరిగా తినాలని సూచిస్తుంటారు.. ఇవి కేవలం కండరాల నిర్మాణానికే కాకుండా, అనేక కీలక శరీర విధులకు చాలా అవసరం.. ఈ కథనంలో శరీరానికి ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు ఎంత అవసరమో.. వాటిని ఏయే శాఖాహారాల నుంచి పొందవచ్చో తెలుసుకోవడం ముఖ్యం.. వాస్తవానికి చికెన్, మటన్, ఫిష్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.. అయితే.. ఎలాంటి శాఖాహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.. అనే వివరాలను తెలుసుకుందాం..

ప్రోటీన్ల ప్రాముఖ్యత – ప్రయోజనాలు:

ప్రోటీన్లు కొత్త కణ నిర్మాణానికి, కండరాల పటిష్టతకు, శరీర సౌష్టవానికి తోడ్పడతాయి. రక్తంలో ప్లేట్‌లెట్స్ తయారీకి, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవి అత్యవసరం. అంతేకాకుండా, హార్మోన్ల ఉత్పత్తిలో ప్రోటీన్ల పాత్ర గణనీయం. చాలామంది ఎదుర్కొనే హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యకు ప్రోటీన్ లోపమే ప్రధాన కారణం అని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.. కండపుష్టి, ధారుడ్యం బాగుండాలంటే ప్రోటీన్ సమృద్ధిగా ఉండాలి.

రోజువారీ ప్రోటీన్ అవసరాలు:

  1. శరీరానికి ప్రతిరోజూ అవసరమయ్యే ప్రోటీన్ మోతాదు వయస్సు, శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది.
  2. పెద్దలు (21 సంవత్సరాలు పైబడినవారు): ఒక కిలోగ్రాము శరీర బరువుకు 1 గ్రాము ప్రోటీన్ అవసరం.
  3. ఎదుగుదల వయసులో ఉన్న పిల్లలు: వీరికి పెరుగుదల అధికంగా ఉంటుంది కాబట్టి, ఒక కిలోగ్రాము శరీర బరువుకు 2 గ్రాముల ప్రోటీన్ అవసరం.
  4. గర్భిణులు, బాలింతలు: వీరికి మరింత ఎక్కువ పోషకాలు అవసరం. కాబట్టి, ఒక కిలోగ్రాము శరీర బరువుకు 2.5 గ్రాముల ప్రోటీన్ కావాలి.

అధిక ప్రోటీన్ ఉన్న శాఖాహారాలు (ప్రతి 100 గ్రాములకు):

మాంసాహారాల్లోనే ప్రోటీన్ అధికంగా ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే, అనేక శాఖాహారాల్లోనూ సమృద్ధిగా ప్రోటీన్ లభిస్తుంది.

  • నువ్వులు: 18 గ్రాముల ప్రోటీన్
  • బాదం: 21 గ్రాముల ప్రోటీన్
  • జీడిపప్పు: 21 గ్రాముల ప్రోటీన్
  • శనగపప్పు: 21 గ్రాముల ప్రోటీన్
  • కందిపప్పు: 22-24 గ్రాముల ప్రోటీన్ (కొన్ని రకాలను బట్టి)
  • రాజ్మా గింజలు: 23 గ్రాముల ప్రోటీన్
  • బొబ్బర్లు: 24 గ్రాముల ప్రోటీన్
  • పెసలు: 24 గ్రాముల ప్రోటీన్
  • మినుములు: 24 గ్రాముల ప్రోటీన్
  • వేరుశనగ గింజలు: 25 గ్రాముల ప్రోటీన్. వీటిని నానబెట్టి తింటే మేక మాంసం కంటే ఐదు రెట్లు ఎక్కువ బలం, ప్రోటీన్ లభిస్తుంది.
  • మైసూర్ పప్పు: 25 గ్రాముల ప్రోటీన్
  • పుచ్చగింజల పప్పు: 34 గ్రాముల ప్రోటీన్. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, స్వీట్లు, కారప్పొడుల్లో వాడవచ్చు.
  • సోయా చిక్కుడు (సోయాబీన్): 43 గ్రాముల ప్రోటీన్. మేక మాంసం, కోడి మాంసం కంటే రెట్టింపు ప్రోటీన్, నాలుగు రెట్లు తక్కువ ధర.
  • తెలగపిండి (గ్రౌండ్ నట్ కేక్): 46 గ్రాముల ప్రోటీన్. వేరుశనగపప్పుల నుండి నూనె తీసిన తర్వాత మిగిలేది తెలగపిండి. ఇది అత్యంత తక్కువ ఖర్చుతో అధిక ప్రోటీన్‌ను అందిస్తుంది. దీనిని కూరలు, ఫ్రైలలో కూడా ఉపయోగించవచ్చు.

మొలకెత్తిన గింజల ప్రత్యేకత:

బొబ్బర్లు, పెసలు వంటి ఎండు గింజలను మొలకెత్తించడం ద్వారా వాటిలోని ప్రోటీన్ విలువ గణనీయంగా పెరుగుతుంది. మొలకెత్తినప్పుడు కార్బోహైడ్రేట్లు తగ్గి, ప్రోటీన్లు పెరుగుతాయి. ఎండు గింజలలో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటే, మొలకెత్తిన తర్వాత అది సుమారు 38-40 గ్రాములకు చేరుకుంటుంది. మొలకలు తేలికగా జీర్ణమవుతాయి.. జీర్ణవ్యవస్థకు ఎటువంటి హాని కలిగించవు. ఇవి తక్కువ ఖర్చుతో, అధిక పోషక విలువలతో కూడిన ఆహారం.

అయితే.. ప్రోటీన్ ఆహారాలు కొన్నిసార్లు గ్యాస్ సమస్యకు దారితీయవచ్చు. అయితే, గ్యాస్ వస్తుందని ప్రోటీన్ ఆహారాన్ని మానేయడం చాలా నష్టదాయకం. మోషన్ ఫ్రీగా ఉండేలా చూసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి, సంతానోత్పత్తికి, వీర్యకణాల వృద్ధికి, హార్మోన్ల సమతుల్యతకు ప్రోటీన్ ఆహారం అత్యవసరం అని పేర్కొంటున్నారు.. ఆరోగ్యకరమైన, సంపూర్ణ జీవితం కోసం నిత్యం ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us