AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయంతో వృద్ధుడు ఏం చేశాడంటే..

హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ పేరుతో 90 ఏళ్ల వృద్ధుడిని సైబర్ మోసగాళ్లు బెదిరించి రూ.18 లక్షలు దోచుకున్నారు. సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేసి, నకిలీ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే డబ్బు చెల్లించాలని చెప్పడంతో బాధితుడు నగదు బదిలీ చేశాడు. మోసం గ్రహించిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయంతో వృద్ధుడు ఏం చేశాడంటే..
Digital Arrest Scam
Shaik Madar Saheb
|

Updated on: Sep 28, 2026 | 12:29 PM

Share

డిజిటల్ అరెస్ట్ అనే మాటే లేదు.. ఎప్పుడూ భయపడొద్దు.. ఎవరైనా అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ వస్తే రెస్పాండ్ అవ్వొద్దు.. అలాగే లింకులపై క్లిక్ చేయొద్దు.. అదంతా మోసం.. వెంటనే పోలీసులను సంప్రదించండి.. అంటూ అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది సైబర్ స్కామ్, క్రిమినల్స్ ఉచ్చులో పడి.. మోసపోతున్నారు. తాజాగా.. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వృద్ధుడిని బెదిరించి పెద్ద మొత్తంలో దోపిడీ చేశారు.. నకిలీ మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామంటూ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు బెదిరించడంతో హైదరాబాద్‌లో 90 ఏళ్ల వృద్ధుడు రూ.18 లక్షలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల ప్రకారం.. మోసగాళ్లు మొదట ఆ వృద్ధుడిని సంప్రదించారు.. తనపై మనీలాండరింగ్ కేసు నమోదైందని.. సహకరించకపోతే అరెస్టు చేస్తామని బెదిరించి, తన బ్యాంకు వివరాలు ఇవ్వమని కోరారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నిందితుడు తనను అరెస్టు నుంచి తప్పించడానికి రూ. 18 లక్షలు డిమాండ్ చేశాడు. తాను నిజమైన సీబీఐ అధికారితోనే మాట్లాడుతున్నానని నమ్మిన బాధితుడు.. ధృవీకరణ తర్వాత ఆ డబ్బు తిరిగి ఇస్తారని ఆశించి, దానిని బదిలీ చేసినట్లు సమాచారం. బదిలీ జరిగిన తర్వాతే తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు.. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లలో, మోసగాళ్లు అధికారుల వలె నటిస్తూ, ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా బాధితులను బెదిరించి డబ్బు వసూలు చేస్తారు. ఈ స్కామ్‌లు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలలో కూడా వృద్ధులను పదేపదే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో, నగరానికి చెందిన 81 ఏళ్ల విశ్రాంత వ్యాపారవేత్త ఒకరు ఇలాంటి మోసంలోనే రూ. 7.12 కోట్లు కోల్పోయినట్లు పేర్కొంటున్నారు.

దర్యాప్తు సమయంలో ఏ పోలీసు లేదా సీబీఐ అధికారి కూడా ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని, లేదా డబ్బు బదిలీ చేయమని అడగరని సైబర్ క్రైమ్ నిపుణులు తెలిపారు. అటువంటి కాల్స్ అందుకున్న వారు, తమ కుటుంబ సభ్యులను, స్థానిక పోలీసులను లేదా జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930ని సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us