
IPL 2026 Player Injury: ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన టీ20 లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League 2026) సీజన్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ మార్చి 28న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగలూరు (Royal Challengers Bengaluru) వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు తలపడనున్నాయి.
అయితే మ్యాచ్‌కు ముందు ఈ రెండు జట్లకు పెద్ద షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు పాట్ కమ్మిన్స్ (Pat Cummins), జోష్ హజెల్ వుడ్ (Josh Hazlewood) ఇంకా గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదు. అందువల్ల IPL 2026 తొలి మ్యాచ్‌ల్లో వీరు ఆడే అవకాశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026)లో కూడా పాల్గొనలేకపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ ఫిజియో పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల నుంచి పూర్తి మెడికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే IPLలో ఆడేందుకు అనుమతి లభిస్తుంది. అందువల్ల సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు వీరు అందుబాటులో ఉండకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతనికి లంబార్ బోన్ స్ట్రెస్ లేదా నగ్గింగ్ బ్యాక్ ఇంజరీగా పేర్కొంటున్నారు. ఈ సమస్య 2025 జూలైలో వెస్టిండీస్ పర్యటన తర్వాత ప్రారంభమైంది. ఆ తరువాత జరిగిన యాషెస్ సిరీస్ ప్రారంభ టెస్టులను కూడా కమిన్స్ మిస్ అయ్యాడు. తరువాత తిరిగి జట్టులో చేరినా పూర్తిగా కోలుకోకపోవడంతో టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది.
జోష్ హేజిల్‌వుడ్ కూడా గాయాలతోనే ఇబ్బంది పడుతున్నాడు. అతనికి హామ్‌స్ట్రింగ్ గాయం మరియు, అచిలీస్ టెండన్ సమస్య ఉంది. 2025 నవంబర్‌లో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సమయంలో హామ్‌స్ట్రింగ్ గాయం తగిలింది. రీహాబ్ సమయంలో అచిలీస్ టెండన్ సమస్య మరింత పెరిగింది. దీంతో అతను యాషెస్ సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ నుంచి కూడా దూరమయ్యాడు.
ప్యాట్ కమిన్స్ ఇప్పటివరకు IPLలో 72 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేట్ 8.8గా ఉంది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు సాధించాడు.
మరోవైపు జోష్ హేజిల్‌వుడ్ 39 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు సాధించాడు. అతని ఎకానమీ రేట్ 8.2. గత సీజన్‌లో అతను అద్భుతంగా బౌలింగ్ చేసి 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి RCB టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ పేసర్లు IPL ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైతే RCB, SRH జట్లకు అది పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..