Vaibhav Suryavanshi: ఆ పనితో రాత్రికి రాత్రే 500 మిస్డ్ కాల్స్.. దెబ్బకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న వైభవ్
IPL 2025: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాడి అద్భుత ప్రదర్శన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు వైభవ్ ఒక విలువైన ఆస్తిగా మారతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కేవలం 14 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే మెరుపు శతకం బాది అందరినీ ఆకట్టుకున్నాడు. అతని ఈ చారిత్రక ఇన్నింగ్స్ తర్వాత ఫోన్‌కు ఏకంగా 500 మిస్డ్ కాల్స్ వచ్చాయని చెప్పుకొచ్చాడు.
ఫోన్ స్విచ్ ఆఫ్.. ఆటపైనే దృష్టి..!
తన తొలి ఐపీఎల్ సెంచరీ తర్వాత వచ్చిన అభినందనల ప్రవాహం గురించి వైభవ్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు. “500కి పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. కానీ, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాను. చాలా మంది నన్ను అభినందించడానికి ప్రయత్నించారు. కానీ, నాకు అంత మంది చుట్టూ ఉండటం ఇష్టం లేదు. నేను 2-4 రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాను. నా కుటుంబం, కొద్దిమంది స్నేహితులతోనే ఉండటానికి ఇష్టపడతాను” అని వైభవ్ తెలిపాడు.
కష్టమే సక్సెస్‌కి కారణం..
తన అద్భుత ప్రదర్శన వెనుక ఉన్న కష్టాన్ని కూడా వైభవ్ వివరించాడు. “నేను 3-4 సంవత్సరాలుగా దీని కోసం సిద్ధమవుతున్నాను. ఇప్పుడు ఫలితాలు చూస్తున్నాను. గతంలో కష్టమనిపించిన విషయాలన్నీ ప్రాక్టీస్‌తో సులభమయ్యాయి. దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని నేను గ్రహించాను. సహజమైన ఆట అంటూ ఏమీ ఉండదు. జట్టుకు ఏది అవసరమో దాని ప్రకారం ఆడాలి. ఈ స్థాయిలో మరీ ఎక్కువ చేయాలని ప్రయత్నించకూడదు. నా బలంపైనే దృష్టి సారించి జట్టును గెలిపించాలి” అని అన్నాడు.
ద్రవిడ్ ప్రశంసలు, సలహాలు:
వైభవ్ సూర్యవంశీ పరిణతి, క్రమశిక్షణ చూసి రాహుల్ ద్రవిడ్ కూడా ముగ్ధుడయ్యాడు. “ఇది అద్భుతమైన సీజన్. నువ్వు చేస్తున్న పనిని, మంచి ఆటను, మంచి శిక్షణను కొనసాగించు. కానీ గుర్తుంచుకో – వచ్చే ఏడాది బౌలర్లు మరింత సిద్ధమై వస్తారు. కాబట్టి, నువ్వు కూడా మరింత కష్టపడి శిక్షణ తీసుకోవాలి, మరింత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. బాగా ఆడావు” అని ద్రవిడ్ వైభవ్‌కి సలహా ఇచ్చాడు.
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాడి అద్భుత ప్రదర్శన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు వైభవ్ ఒక విలువైన ఆస్తిగా మారతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








