IPL 2025: 3 రోజుల్లో మ్యాచ్.. కట్ చేస్తే.. HCA కి ED నోటీసులు! అయోమయంలో ఆరెంజ్ ఆర్మీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిధుల దుర్వినియోగంపై ED దర్యాప్తు ప్రారంభించింది. ₹51.29 లక్షల స్థిరాస్తిని అటాచ్ చేసి, HCA మాజీ అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లడించింది. IPL 2025కు ముందు ఈ వివాదం తెరపైకి రావడం హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే, హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌లు యథావిధిగా జరగనున్నాయని సమాచారం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభానికి ముందే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగంపై తీవ్ర దర్యాప్తు చేపట్టింది. దీనిలో భాగంగా ₹51.29 లక్షల విలువైన స్థిరాస్తిని అటాచ్ చేసింది. HCAకి చెందిన నిధులను అనుచితంగా వినియోగించినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిందని ED తన విచారణలో తేల్చింది. మొదట ఈ నిధులు పరిశీలన, స్టేడియం అభివృద్ధి, ఆధునీకరణ పనుల కోసం కేటాయించబడినప్పటికీ, అవి క్రికెట్ బంతులు, జిమ్ పరికరాలు, బకెట్ కుర్చీలు కొనుగోలు పేరుతో ఇతర కంపెనీలకు బదిలీ అయ్యాయి.
ఈ అవకతవకల్లో ప్రధానంగా నిందితులుగా హైలైట్ అవుతున్న వారు HCA మాజీ ఉపాధ్యక్షుడు, కోశాధికారి సురేందర్ అగర్వాల్. ఈ నిధులు సారా స్పోర్ట్స్ ఎక్సలెంట్ ఎంటర్‌ప్రైజెస్, బాడీ డ్రెంచ్ ఇండియా అనే సంస్థల ద్వారా సురేందర్ అగర్వాల్ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని ED తన నివేదికలో పేర్కొంది.
ఈ అవకతవకలు చిన్నవి కావు. సారా స్పోర్ట్స్ ₹17 లక్షలు KB జ్యువెలర్స్ (సురేందర్ అగర్వాల్ భార్య యాజమాన్య సంస్థ) కి బదిలీ చేయగా, ఎక్సలెంట్ ఎంటర్‌ప్రైజెస్ ₹21.86 లక్షలను అక్షిత్ అగర్వాల్ (సురేందర్ కుమారుడు) బ్యాంకు ఖాతాలోకి జమ చేసింది.
ED దర్యాప్తులో తేలిందేమంటే, “సారా స్పోర్ట్స్ ₹17 లక్షలను సురేందర్ అగర్వాల్ భార్య యాజమాన్య సంస్థ KB జ్యువెలర్స్‌కు బదిలీ చేసింది. అదేవిధంగా, అక్షిత్ అగర్వాల్ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో మ్యూజిక్ షోలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి వ్యాపారాల నెపంతో అనేక ఖాతాల ద్వారా మళ్లింపులు జరిగాయి.”
ఇక్కడితో ఆగలేదు, వజ్రాల కొనుగోళ్లకు కూడా ఈ నిధులను మళ్లించారని ED పేర్కొంది. మొత్తం మీద, ₹90.86 లక్షలు అక్రమ మార్గంలో మళ్లించబడ్డాయని ED దర్యాప్తులో వెల్లడైంది.
IPL 2025పై ఎఫెక్ట్ ఉండదా?
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ED దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌లు యథావిధిగా జరుగుతాయని సమాచారం. IPL 2025లో భాగంగా మార్చి 23న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు IST నుండి ప్రారంభమవుతుంది. మరోవైపు, మార్చి 22న IPL 2025 తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య కోల్‌కతాలో జరుగుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..