IPL 2023: ఒక్కో పరుగుకు కోటి రూపాయలు.. ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్లేయర్ ఇతడే..!
ఐపీఎల్ 2023 ముగిసింది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని ట్రోఫీ గెలుచుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
ఐపీఎల్ 2023 ముగిసింది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని ట్రోఫీ గెలుచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆదివారం జరగాల్సిన ఈ ఫైనల్.. వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను రూ. 16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్, అలాగే టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో మినీ వేలంలో స్టోక్స్ భారీ ధర పలికాడు. ఇక భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన అతడు.. కేవలం 2 మ్యాచ్‌లతోనే సరిపెట్టుకున్నాడు. అద్దరగొడతాడనుకుంటే.. కాలి నొప్పి అంటూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఆ తర్వాత లీగ్ స్టేజిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కనీసం ప్లేఆఫ్స్‌కైనా అందుబాటులో ఉంటాడని భావించినా.. జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే యాషెస్ పోరుకు సిద్దమవ్వాలంటూ ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. మరోవైపు ఈ సీజన్‌లో బెన్ స్టోక్స్ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి.. 15 పరుగులు చేశాడు. అలాగే ఒక ఓవర్ వేసి 18 పరుగులు సమర్పించుకున్నాడు. రూ. 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ ప్లేయర్ పట్టుమని 16 పరుగులు కూడా చేయలేదంటూ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. గణాంకాలు చూస్తే.. స్టోక్స్ తాను ఈ సీజన్‌లో చేసిన పరుగులకు.. ఒక్కో పరుగుకు ఒక్కో కోటి రూపాయలు సొంతం చేసుకున్నాడని అంటున్నారు. కాగా, బెన్ స్టోక్స్ మాదిరిగానే జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఇంటి ముఖం పట్టిన విషయం విదితమే. దీంతో ఫ్యాన్స్ నెక్స్ట్ సీజన్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్లను తీసుకోవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.