IPL 2023: ఈ 5గురి ఆటగాళ్లకు మినీ వేలంలో మొండిచెయ్యే.. లిస్టులో కోహ్లీ సహచరుడు..
మరికొన్ని రోజుల్లో కొచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ ఆక్షన్‌లో ఏ ప్లేయర్.. ఏ రేటుకు అమ్ముడవుతాడోనని..
మరికొన్ని రోజుల్లో కొచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ ఆక్షన్‌లో ఏ ప్లేయర్.. ఏ రేటుకు అమ్ముడవుతాడోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ వేలంలో 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. 405 మందిని షార్ట్‌లిస్టు చేశారు. ఇందులో 273 ఇండియన్ ప్లేయర్స్.. 132 విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ లిస్టులో పలువురు అంతర్జాతీయ ప్లేయర్స్‌పై ఫ్రాంచైజీలు గురి పెట్టారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే.. ఈ వేలంలో విదేశీ ప్లేయర్స్ కొందరికి నిరాశ తప్పేలా లేదు. ముఖ్యంగా రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న పేర్లలో ఈ 5గురి ప్లేయర్స్‌కు మొండిచెయ్యే.
ఏంజెలో మాథ్యూస్:
ఈ శ్రీలంక వెటరన్ ఆల్‌రౌండర్ గత 2-3 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. 35 ఏళ్ల ఈ ఆటగాడికి టీ20 రికార్డు పెద్దగా లేదు. అయినప్పటికీ, ఐపీఎల్ కోసం మాథ్యూస్ ప్రస్తుతం.. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. అక్కడ అతడు తన బ్యాట్‌తో ఒకట్రెండు మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అయినా లంక లీగ్‌కు ఐపీఎల్‌కు చాలా తేడా ఉంది కాబట్టి.. ఏ ఫ్రాంచైజీ కూడా ఈ ఆటగాడిపై ఆసక్తి చూపించే అవకాశం కనిపించట్లేదు.
టై మిల్స్:
ఇంగ్లాండ్‌కు చెందిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్‌ను గత సంవత్సరం ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది, కానీ అతడికి కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగే అవకాశం దక్కింది. అంతేకాకుండా అందులో మిల్స్ పెర్ఫార్మన్స్ కూడా యావరేజ్. ఆ తర్వాత T20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే టోర్నీలో మాత్రం ఏ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. భారత పిచ్‌లపై ఈ 30 ఏళ్ల బౌలర్‌కు బౌలింగ్ రికార్డు కూడా సోసోగానే ఉంది. తరచుగా గాయాల బారిన పడుతుంటాడు. అలాగే మిల్స్ ఆగష్టు 2022 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా, మిల్స్ గతంలో విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున ఆడిన సంగతి తెలిసిందే.
జామీ ఓవర్టన్:
ఇంగ్లాండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ఈ పొడవాటి ఫాస్ట్ బౌలర్ బేస్ ప్రైస్ కూడా రూ. 2 కోట్లు. అయితే ఇతడ్ని ఫ్రాంచైజీలు ఎన్నుకోవడం దాదాపు అసాధ్యం. సహజంగా ఓవర్టన్ బౌలింగ్ ఆల్‌రౌండర్, బ్యాట్‌తో బాగా రాణిస్తున్నాడు. అలాగే T20 కెరీర్‌లో 173 స్ట్రైక్ రేట్‌తో ఐదు వందల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కానీ బౌలింగ్‌లో 9 కంటే ఎక్కువ ఎకానమీ ఉండటంతో ఫ్రాంచైజీలను ఆకర్షించడం కష్టమే.
క్రెయిగ్ ఓవర్టన్:
క్రెయిగ్ ఓవర్టన్ ఇంగ్లాండ్‌కు చెందిన మీడియం పేసర్, కానీ అతడి T20 కెరీర్ గణాంకాలు పెద్దగా ఆకట్టుకోవు. ఆడిన 70 మ్యాచ్‌లలో 70 వికెట్లు తీశాడు. ఎకానమీ పరంగా ఓవర్‌కు 9 పరుగులు సమర్పించాడు. బ్యాట్‌తో అతడిది 123 స్ట్రైక్‌రేట్. ఇలాంటి గణాంకాలతో ఉన్న విదేశీ ఆటగాడికి ఏ ఫ్రాంచైజీ కూడా రూ. 2 కోట్లు వెచ్చించరు.
నాథన్ కౌల్టర్‌నైల్:
ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్పెషలిస్ట్ T20 బౌలర్ అనేక ఐపీఎల్ సీజన్లు పాల్గొన్నాడు. దాదాపు ప్రతి సీజన్‌లోనూ అతడ్ని వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అయితే ఈ 35 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. అలాంటి పరిస్థితిలో, ఫ్రాంచైజీలు అంత డబ్బు వెచ్చించే అవకాశం తక్కువ.