Rishabh Pant: అంపైర్‌తో వాగ్వాదం.. కట్‌చేస్తే.. రెండు సెంచరీల ప్లేయర్‌కు ఊహించని షాకిచ్చిన ఐసీసీ
England vs India, 1st Test భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న లీడ్స్ టెస్టులో డబుల్ సెంచరీల హీరో రిషబ్ పంత్ సెలబ్రేషన్స్‌తో ఒకసారి, క్రమశిక్షణ రాహిత్యంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అది ఎందుకో, ఎప్పుడో... అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant: లీడ్స్ టెస్టులో భారత్ తరఫున రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్. కానీ, ఇదే సమయంలో అతడు ఒక తప్పు కూడా చేశాడు. పంత్ తీరుపై ఐసీసీ అతడ్ని మందలించింది కూడా. లెవల్ 1 కింద పంత్ ను దోషిగా తేల్చింది. ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ అతన్ని మందలించి వదిలేశాడు. అంటే అతనిపై తదుపరి చర్యలు తీసుకోలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో అంపైర్ నిర్ణయాన్ని లెక్కచేయకపోవడం లేదా అభ్యంతరం చెప్పడం వంటి పనులు ఆర్టికల్ 2.8 కిందకి వస్తాయి. ఈ నిబంధనలను పంత్ అతిక్రమించాడని ఐసీసీ అతడ్ని దోషిగా తేలుస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంత్ ఖాతాలో 1 డీమెరిట్ పాయింట్ కూడా జోడించింది.
పంత్ చేసిన తప్పేంటి?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రిషబ్ పంత్ మందలించబడిన ఆ తప్పును ఎప్పుడు చేసాడా అని.. ఈ సంఘటన లీడ్స్ టెస్ట్ మూడో రోజు జరిగింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ 61వ ఓవర్లో.. బంతి ఆకారం మారిందని, దాన్ని మార్చాలని పంత్… ఫీల్డ్ అంపైర్‌ని అడిగాడు. బంతిని తనిఖీ చేసిన అంపైర్ కొత్త బంతి ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో కోపానికి గురైన పంత్.. అంపైర్ చేతిలో బంతిని తీసుకుంటూ అతనితో చిన్నపాటి వాగ్వాదానికి గురయ్యాడు. అంతేకాదు కోపంతో బంతిని పంత్ నేలపై విసిరాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్‌తో ఒక ఆటగాడు ఇలా ప్రవర్తించడం నేరం. అందుకే పంత్ మందలించబడ్డాడు.
మ్యాచ్ రిఫరీ ముందు తప్పును అంగీకరించిన పంత్..
ఐసిసి పత్రికా ప్రకటన ప్రకారం.. రిషబ్ పంత్ తన తప్పును మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ముందు అంగీకరించాడు. దీంతో దీనిపై తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు పాల్ రైఫిల్ , క్రిస్ జాఫ్నీ మైదానంలో పంత్ ప్రవర్తనపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. వీరితో పాటు, థర్డ్ అంపైర్ షర్ఫుదుల్లా, నాల్గవ అంపైర్ మైక్ బర్న్స్ కూడా ఆరోపణలు చేశారు. లెవల్ 1 కింద దోషులుగా తేలిన ఆటగాళ్లకు కనీస శిక్ష మందలింపు. గరిష్ట శిక్ష వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం తగ్గింపు, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు వారి ఖాతాలో జోడించడం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








