IND vs NZ 1st ODI: చెలరేగిన కివీస్ బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ టార్గెట్..
India vs New Zealand, 1st ODI: ఒక దశలో కివీస్ భారీ స్కోరు చేసేలా కనిపించినా, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేయగా, ప్రసిద్ధ్ కృష్ణ తన వేగంతో కివీస్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.

2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉన్న భారత్, న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కివీస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, కివీస్ బ్యాటర్లు పట్టుదలగా ఆడి భారీ స్కోరు సాధించారు.
ఓపెనర్ల శుభారంభం: న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 117 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత హర్షిత్ రాణా ఈ జోడీని విడదీశాడు. దీంతో భారత్ రేసులోకి వచ్చింది.
డారిల్ మిచెల్ మెరుపులు: వికెట్లు పడుతున్నా ఒకవైపు డారిల్ మిచెల్ పట్టువదలకుండా ఆడాడు. కేవలం 71 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు స్కోరును 300 మార్కుకు చేర్చాడు. చివరి ఓవర్లలో క్రిస్టియన్ క్లార్క్ (24) తో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మిచెల్ అవుట్ కావడంతో కివీస్ స్కోరు కాస్త నెమ్మదించింది.
టీమ్ ఇండియా బౌలింగ్: భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఫీల్డింగ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో మైకేల్ బ్రేస్‌వెల్‌ను రనౌట్ చేయడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది.
లక్ష్యం – 301 పరుగులు: ఫ్లాట్ పిచ్‌గా కనిపిస్తున్న వడోదర మైదానంలో 301 పరుగుల లక్ష్యం ఛేదించదగ్గదే. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వంటి దిగ్గజ బ్యాటర్లు కివీస్ పేస్ అటాక్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
ఇది రెండు జట్లలో ప్లేయింగ్ 11..
భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్
దక్షిణాఫ్రికా: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్టియన్ క్లార్క్, మైఖేల్ రే, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్, జాక్ ఫాల్క్స్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




