Vaibhav Suryavanshi : నీకు చాలా ఫ్యూచర్ ఉంది.. నీకెందుకు ఇలాంటి అనవసరమైన రికార్డు.. కాస్త చూస్కో వైభవ్ బ్రో
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ పర్యటన వైభవ్ సూర్యవంశీకి కూడా చిరస్మరణీయంగా నిలిచినా, చివరి ఇన్నింగ్స్‌లో మాత్రం అతనికి చేదు అనుభవం ఎదురైంది. ఆఖరి యూత్ టెస్టులో వైభవ్ ఎదుర్కొన్న మొదటి బంతికే (గోల్డెన్ డక్) అవుట్ అయి ఒక అనవసరమైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.

Vaibhav Suryavanshi : ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ పర్యటన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా చిరస్మరణీయంగా నిలిచినా, చివరి ఇన్నింగ్స్‌లో మాత్రం అతనికి చేదు అనుభవం ఎదురైంది. ఆఖరి యూత్ టెస్టులో భారత్‌కు కేవలం 81 పరుగుల లక్ష్యం మాత్రమే లభించింది. అయితే, ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్, ఎదుర్కొన్న మొదటి బంతికే (గోల్డెన్ డక్) అవుట్ అయి ఒక అనవసరమైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
కేవలం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆస్ట్రేలియాకు చెందిన యువ పేసర్ చార్లెస్ లాచ్‌మండ్ మొదటి ఓవర్ చివరి బంతికి జూలియన్ ఆస్‌బోర్న్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన వైభవ్ 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ ఆయుష్ మాత్రీతో కలిసి ఓపెనర్‌గా ఆరంభించిన వైభవ్, తొలి బంతికే సున్నా పరుగులకి అవుట్ కావడం 2025లో ఇది రెండోసారి.
యూత్ టెస్ట్ మ్యాచ్‌లోని నాల్గవ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బ్యాట్స్‌మన్‌గా గోల్డెన్ డక్ అయిన నాలుగో క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్రలో నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన లాహిరు తిరిమాన్నే, ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్, ఓలీ రాబిన్సన్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. అంతకుముందు ఇదే సంవత్సరం ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ టెస్టులో కూడా వైభవ్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో వైభవ్ అండర్-19 మల్టీ డే మ్యాచ్‌లలో గౌతమ్ గంభీర్ (331 పరుగులు) రికార్డును కేవలం ఒక పరుగు తేడాతో అధిగమించే అవకాశాన్ని కోల్పోయాడు.
ఈ ఆఖరి యూత్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌట్ అయింది. దీనికి సమాధానంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులు చేసి 36 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత, భారత బౌలర్లు ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 116 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్‌కు గెలవడానికి 81 పరుగుల స్వల్ప లక్ష్యం లభించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ వైభవ్ త్వరగా అవుటైనా, కెప్టెన్ ఆయుష్ మాత్రే (13), ముఖ్యంగా అజేయంగా నిలిచిన వేదాంత్ త్రివేది (33), రాహుల్ కుమార్ (13) సమయోచితంగా ఆడటంతో భారత్ ఈ మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలుచుకుంది.
ఈ ఆస్ట్రేలియా పర్యటన భారత అండర్-19 జట్టుకు మరపురాని విజయాన్ని అందించింది. టీమిండియా ఆడిన అన్నీ 5 మ్యాచ్‌లను (3 యూత్ వన్డేలు, 2 యూత్ టెస్టులు) గెలిచి క్లీన్-స్వీప్ చేసింది. దీంతో యువ క్రికెటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని మరోసారి రుజువైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




