Ishan Kishan: అరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికి సిక్సర్‌.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఇషాన్ కిషన్

Ishan Kishan: శ్రీలంకతో వన్డే సిరీస్‌‌లో టీమిండియా శుభారంభం చేసింది. సంజు శాంసన్ ప్లేస్‌లో వన్డే జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్..తన తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకంతో సత్తా చాటాడు.

Ishan Kishan: అరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికి సిక్సర్‌.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఇషాన్ కిషన్
Ishan Kishan
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 19, 2021 | 4:31 PM

IND Vs SL ODI Series: శ్రీలంకతో వన్డే సిరీస్‌‌లో టీమిండియా శుభారంభం చేసింది. సంజు శాంసన్ ప్లేస్‌లో వన్డే జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్..తన తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకంతో సత్తా చాటాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్.. తన అరంగేట్ర మ్యాచ్‌‌లో తొలి బంతినే సిక్సర్‌ బాదాడు. రెండో బంతిని బౌండరీ కొట్టాడు.  కాకతాళీయంగా తన జన్మదినం నాడే వన్డే‌లో అరంగేట్ర చేసిన ఇషాన్..ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. సిక్సర్లు, బౌండరీలతో పరుగులు వరదపారించాడు. కేవలం  42 బంతుల్లో రెండు సిక్సర్లు, 8 బౌండరీలతో 59 పరుగులు సాధించిన ఇషాన్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా తొలి బంతిని సిక్సర్ కొట్టడంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ఇషాన్. తొలి బంతికి సిక్సర్ కొడుతానని డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు ముందే చెప్పినట్లు తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, ఆదివారం తన జన్మదినం కావడం కూడా తొలి బంతిని సిక్స్‌గా మలచడానికి కారణాలుగా మ్యాచ్ అనంతరం చాహల్‌తో కలిసి ‘చాహల్ టీవీ’లో మాట్లాడిన ఇషాన్ చెప్పుకొచ్చాడు. ఇషాన్ టీ20 అరంగేట్ర మ్యాచ్‌లోనూ తొలి బంతిని సిక్సర్ కొట్టడం విశేషం.

వన్డే‌లో అరంగేట్రంపై స్పందించిన ఇషాన్.. భారత జట్టు జెర్సీని ధరించడం ఓ పెద్ద గౌరవంగా పేర్కొన్నాడు. తన కలలు సాకారం కావడం ప్రారంభమైనట్లు సంతోషం వ్యక్తంచేశాడు. తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నాడు. దేశం కోసం కష్టపడి పనిచేయాలన్న తన లక్ష్యం కొనసాగుతూనే ఉంటుందని ట్వీట్ చేశాడు.

తొలి మ్యాచ్‌లో తొలి బంతిని సిక్సర్‌గా మలచడంపై ఆసక్తికర విషయాలు చెప్పిన ఇషాన్..

ఆదివారంనాటి తొలి వన్డేలో శ్రీలంకపై భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. కొలంబొలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు సాధించింది. భారత జట్టు 36.4 ఓవర్లలో 3 వికెట్ల మాత్రమే కోల్పోయి విజయ లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శిఖర్ థావన్ 86 నాటౌట్, పృథ్వీ షా 43, ఇషాన్ కిషన్ 59 రాణించారు.