94 బంతుల్లోనే 222 పరుగులు.. కంగారు బౌలర్లపై ఊచకోత.. సంబరాల్లో హైదరాబాద్ ఫ్యాన్స్..

57 బంతుల్లోనే సెంచరీ.. 83 బంతులకే 174 పరుగులు.. తృటిలో డబుల్ సెంచరీ మిస్.. కానీ ప్రత్యర్థి బౌలర్లకు మాత్రం ఈ ఇన్నింగ్స్ పీడకలే. 13 ఫోర్లు, 13 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వన్డేల్లో రికార్డ్ స్థాయిలో టీమ్ స్కోర్ నమోదు చేయడమే కాక వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ను..

94 బంతుల్లోనే 222 పరుగులు.. కంగారు బౌలర్లపై ఊచకోత.. సంబరాల్లో హైదరాబాద్ ఫ్యాన్స్..
Heinrich Klaasen
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Sep 16, 2023 | 11:22 AM

57 బంతుల్లోనే సెంచరీ.. 83 బంతులకే 174 పరుగులు.. తృటిలో డబుల్ సెంచరీ మిస్.. కానీ ప్రత్యర్థి బౌలర్లకు మాత్రం ఈ ఇన్నింగ్స్ పీడకలే. 13 ఫోర్లు, 13 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వన్డేల్లో రికార్డ్ స్థాయిలో టీమ్ స్కోర్ నమోదు చేయడమే కాక వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ను కూడా పెంచేశాడు ఓ బ్యాటర్. సీన్ కట్ చేస్తే.. ఆ బ్యాటర్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హైదరాబాదీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది కప్ తమదేనంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇంతకీ ఎవరా విధ్వంసకర బ్యాటర్..? ఎందుకు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు..?

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగమైన హెన్రీచ్ క్లాసెన్ అంతర్జాతీయ స్థాయిలో విధ్వంసం సృష్టించడమే కాక కంగారు బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డే సిరీస్‌లో తన జట్టుకు కీలకమైన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శుక్రవారం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాల్గో వన్డేలో క్లాసెన్ తన క్లాసిక్ స్టైల్‌లో 83 బంతుల్లోనే 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 174 పరుగులు చేయడమే కాక జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్‌ కూడా 2-2 గా సమమైంది. 5 వన్డేల సిరీస్‌లోని ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ 2-1 ఆధిక్యంతో ఉంది. మరో మ్యాచ్ ఓడితే సిరీస్ కోల్పోయినట్లే అన్న పరిస్థితిలో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు క్వింటన్ డి కాక్(45), రీజా హెండ్రిక్స్(28) పర్వాలేదనింపించే శుభారంభం అందించారు. మూడో నెంబర్‌లో వచ్చిన వాన్‌డెర్ డసన్ కూడా 62 పరుగులతో రాణించినా.. కెప్టెన్ మార్క్రమ్ 8 పరుగులకే వెనుదిరిగాడు.

ఇవి కూడా చదవండి

ఇలా 25.1 ఓవర్లలో 120 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాకు క్లాసెన్ ఆపద్భాంధవుడిగా అవతరించాడు. తన ఆటను నెమ్మదిగానే ప్రారంభించినా 39 బంతుల్లో 53.. 58 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీకి ముందు ఓ కథ.. సెంచరీ తర్వాత మరో కథ అనుకున్నాడో ఏమో కానీ తర్వాతి 26 బంతుల్లోనే వరుస ఫోర్లు, సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అయితే మార్కస్ స్టోయినీస్ వేసిన చివరి ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌‌ ఆడబోయి నాథన్ ఎల్లిస్ చేతికి చిక్కాడు. దీంతో క్లాసెన్ ఇన్నింగ్స్ 174 పరుగుల వద్ద ముగిసింది. ఇంత భారీ స్కోర్ సాధించే క్రమంలో క్లాసెన్, మిల్లర్(82*; 45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) కలిసి ఆసీస్ బౌలర్లపై 94 బంతుల్లోనే 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అలాగే జట్టు స్కోర్ కూడా 5 వికెట్ల నష్టానికి 416 పరుగులకు చేరుకుంది. ఈ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ కారే(99), టిమ్ డేవిడ్(35) మినహా మిగిలినవారెవరూ రాణించలేదు. దీంతో ఆస్ట్రేలియా 252 పరుగులకే ఆలౌట్ అయింది.

అప్పుడు కూడా ఇదే కథ..

అయితే ఈ మ్యాచ్‌లో క్లాసెన్ కనబర్చిన విధ్వంసకర ప్రదర్శనను చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. 4వ వన్డేలో క్లాసెన్ 174, మూడో వన్డేలో ఎస్ఆర్‌హెచ్, సౌతాఫ్రికా కెప్టెన్ ఐడన్ మార్క్రమ్ అజేయమైన సెంచరీ (102; 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయడంతో ఐపీఎల్ 2024 టైటిల్ తమదేనంటూ సంబరపడిపోతున్నారు. మరోవైపు భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు క్లాసెన్ ఇలా చెలరేగిపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సౌతాఫ్రికా బ్యాటర్లు ఇదే విధంగా మెగా టోర్నీలో చెలరేగితో అనూహ్యంగా ఫైనల్‌కు కూడా చేరుతుందని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..