IPL 2027: ఆ ఒక్క కండీషన్‌తో ముంబైను వీడి కేకేఆర్‌కు హార్దిక్ పాండ్యా.. అదేంటో తెలుసా..?
KKR Hardik Pandya Offer: ఐపీఎల్ ట్రేడ్ విండోలో హార్దిక్ పాండ్యా నిర్ణయం అన్ని జట్ల వ్యూహాలను మార్చేలా ఉంది. ముంబై, కేకేఆర్ యాజమాన్యాల నడుమ సాగుతున్న ఈ చర్చలు త్వరలోనే కొలిక్కి వస్తే ఐపీఎల్ 2027కి ముందే సరికొత్త సమీకరణాలు ఆవిష్కృతమవుతాయి.

Hardik Pandya Captaincy KKR: ఐపీఎల్ 2027 ఆరంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో భారీ ట్రేడ్ డ్రామా మొదలైంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ మైండ్ బ్లాకింగ్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఏకంగా రూ. 25 కోట్ల నగదుతో పాటు కెప్టెన్సీ ఇస్తామని ప్రతిపాదించడంతో ఈ బదిలీ వ్యవహారం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనంగా మారింది.
గత కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారం సాగింది. అయితే నాయకత్వ బాధ్యతలు ఇవ్వడంపై ఇరు వర్గాల మధ్య సమ్మతి కుదరకపోవడంతో ఆ చర్చలు నిలిచిపోయాయి. సీఎస్కేతో డీల్ దెబ్బతినడంతో రంగంలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ అడిగిన వెంటనే సారథ్య పగ్గాలు అప్పగించేందుకు పచ్చజెండా ఊపింది. అజింక్య రహానే కెప్టెన్సీలో అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోవడంతో కేకేఆర్ యాజమాన్యం కొత్త నాయకుడి కోసం తీవ్రంగా వేట సాగిస్తోంది. భారత్ తరఫున, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆల్‌రౌండర్‌గా, నాయకుడిగా నిరూపించుకున్న పాండ్యాను తమ గూటికి చేర్చుకోవాలని పట్టుదలతో ఉంది.
ముంబై విధించిన ఆ ఒక్క కఠిన నిబంధన..
హార్దిక్ పాండ్యాను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ సులభంగా ఒప్పుకోవడం లేదు. స్టార్ ఆల్‌రౌండర్‌ను పంపించాలంటే తమకు ప్రతిఫలంగా నాణ్యమైన యంగ్ ప్లేయర్లను ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో చెన్నై నుంచి ఆయుష్ మ్హాత్రే లేదా శివమ్ దూబేను ముంబై కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కేకేఆర్ నుంచి కూడా కీలక ఆటగాడిని ఇచ్చేందుకు అంగీకరిస్తేనే బదిలీ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. కేవలం నగదు బదిలీ మాత్రమే కాకుండా జట్టు భవిష్యత్తు అవసరాలను తీర్చే ప్లేయర్ కావాలని కోరడమే ఈ ట్రేడింగ్‌లో ప్రధాన అడ్డంకిగా మారింది.
పాండ్యా నిష్క్రమణకు అసలు కారణాలివే..
రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ అభిమానుల నుంచి ఊహించని రీతిలో వ్యతిరేకత ఎదురైంది. మైదానంలో వరుస వైఫల్యాలు, ప్రతికూల ఫలితాల వల్ల జట్టు మేనేజ్‌మెంట్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం దెబ్బతిందనే ప్రచారం కూడా సాగింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత జట్టు ప్రదర్శనపై సమీక్ష జరిపిన ముంబై యాజమాన్యం నాయకత్వ మార్పుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ముంబై జట్టు నుంచి వైదొలగాలని హార్దిక్ కూడా నిశ్చయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఎల్ 2027 ముందు సంచలన పరిణామాలు..
ముంబై ఇండియన్స్ జారీ చేసిన షరతులకు కేకేఆర్ అంగీకరిస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ట్రేడింగ్‌గా ఇది నిలిచిపోతుంది. పాండ్యాను సంపాదించుకుంటే కేకేఆర్ జట్టు ఆల్‌రౌండ్ సత్తాతో పాటు నాయకత్వ లోటును కూడా భర్తీ చేసుకోగలదు. ముంబై ఫ్రాంచైజీ మాత్రం పాండ్యా నిష్క్రమణ ద్వారా వచ్చే సొమ్ముతో పాటు యంగ్ రక్తాన్ని జట్టులోకి తెచ్చుకుని రీబిల్డింగ్ ప్రారంభించాలని చూస్తోంది. డిసెంబర్‌లో జరగనున్న మినీ వేలానికి ముందే ఈ మెగా ట్రేడ్ డీల్ ముగిసే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




