దశాబ్దాల కల సాకారం! తీరప్రాంత సంస్కృతికి చారిత్రక గుర్తింపు.. తుళు భాషకు అధికారిక హోదా!
కర్ణాటక ప్రభుత్వం తుళు భాషకు దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలకు రెండో అదనపు అధికారిక పరిపాలనా భాష హోదా కల్పించింది. మంగళూరులో జరిగిన చారిత్రక కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తీరప్రాంత అభివృద్ధి, పర్యాటకం, మత్స్య పరిశ్రమకు రూ.32,611 కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. తుళు సంస్కృతికి ఇది అరుదైన గౌరవం.

కర్ణాటక తీరప్రాంత ప్రజల దశాబ్దాల నాటి డిమాండ్‌కు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. తుళు భాషకు రాష్ట్ర రెండో అదనపు అధికారిక పరిపాలనా భాష హోదా కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 18న మంగళూరులో తొలిసారి నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ హోదా ప్రధానంగా దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలకు వర్తిస్తుందని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు.
తుళు భాషకు అధికారిక గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. తీరప్రాంత కర్ణాటకలోని జానపద కళలు, యక్షగానం, ఆచారాలు, సాహిత్యం, నిత్య జీవితంలో తుళు భాషకు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కన్నడ, ఉడుపితో పాటు పొరుగు ప్రాంతాల్లోనూ తుళు మాట్లాడే ప్రజలు ఉన్నారు. భాషకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని సాంస్కృతిక సంస్థలు, భాషాభిమానులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
మంగళూరులో జరిగిన ఈ కేబినెట్ సమావేశం మరో విషయంలోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరు వెలుపల కర్ణాటక మంత్రివర్గం సమావేశం కావడం ఇదే తొలిసారి. తీరప్రాంత అభివృద్ధి, మౌలిక వసతులు, పర్యాటకం, మత్స్య పరిశ్రమ తదితర అంశాలపై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
రూ.32,611 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం
కేబినెట్ సమావేశంలో మొత్తం రూ.32,611 కోట్ల విలువైన ప్రాజెక్టులు, ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో గ్రామీణాభివృద్ధి, రోడ్లు, మౌలిక వసతులతో పాటు తీరప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. పుత్తూరులో రూ.549 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తీర, మల్నాడు ప్రాంతాల కోసం Coastal-Malnad Karnataka Tourism Policy 2026ను కూడా కేబినెట్ ఆమోదించింది. ఈ విధానం కింద పర్యాటక ప్రాజెక్టులను మౌలిక వసతుల ప్రాజెక్టులుగా పరిగణించి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వివిధ రాయితీలు, సౌకర్యాలు కల్పించనున్నారు.
ఫిషరీస్, బ్లూ ఎకానమీపై ఫోకస్
మంగళూరులోని ప్రస్తుత మత్స్య కళాశాలను ఫిషరీస్ అండ్ బ్లూ ఎకానమీ యూనివర్సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కళాశాలలో విద్యార్థుల ప్రవేశ సామర్థ్యాన్ని 60 నుంచి 200 సీట్లకు పెంచాలని నిర్ణయించింది. అలాగే 150 ఎకరాల్లో ప్రత్యేక ఫిషరీస్ పార్క్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
దక్షిణ కన్నడ పేరును మంగళూరుగా మార్చే ప్రక్రియ
దక్షిణ కన్నడ జిల్లాను మంగళూరు జిల్లాగా మార్చాలన్న ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే పేరు మార్చకుండా ముందుగా ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. ఇందుకోసం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించింది. వచ్చిన అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తుళు గుర్తింపుతో ఏం మారుతుంది?
తుళుకు అదనపు అధికారిక పరిపాలనా భాష హోదా రావడం వల్ల దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో ప్రభుత్వ పరిపాలనలో తుళు వినియోగానికి అధికారిక గుర్తింపు లభించే దిశగా అడుగు పడింది. అయితే ఇది కర్ణాటక మొత్తం అధికారిక భాషగా తుళును ప్రకటించడం కాదు, ప్రస్తుత నిర్ణయం దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలకు పరిమితమైన అదనపు పరిపాలనా భాష హోదా లభించనుంది. అయితే, తుళును రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్ మాత్రం వేరు. ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ నిర్ణయం ఆ రాజ్యాంగపరమైన గుర్తింపును కల్పించదు. అది కేంద్ర స్థాయిలో తీసుకోవాల్సిన ప్రత్యేక నిర్ణయం.
రాజకీయ ప్రాధాన్యత..!
తీరప్రాంత కర్ణాటకలో దక్షిణ కన్నడ, ఉడుపి ప్రాంతాలు చాలాకాలంగా బీజేపీకి బలమైన రాజకీయ ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంగళూరులోనే తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించడం, ప్రాంతీయ డిమాండ్లపై వరుస నిర్ణయాలు ప్రకటించడం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ చర్యలను ప్రాంతీయ అభివృద్ధి, ప్రజల డిమాండ్ల పరిష్కారంలో భాగంగా వివరిస్తోంది.
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రభుత్వం వచ్చే 15 నెలల్లో కర్ణాటకలోని 10 నుంచి 12 ప్రాంతాల్లో బెంగళూరుకు వెలుపల కేబినెట్ సమావేశాలు నిర్వహించే ప్రణాళికను కూడా ప్రకటించింది. స్థానిక అవసరాలు, ఆర్థిక పరిస్థితులు, చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాంతాలను ఎంపిక చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
మొత్తంగా మంగళూరులో జరిగిన కేబినెట్ సమావేశం తుళు భాషకు అధికారిక పరిపాలనా గుర్తింపు, జిల్లా పేరు మార్పుపై ప్రజాభిప్రాయ సేకరణ, పర్యాటక విధానం, ఫిషరీస్ పార్క్, వైద్య-విద్యా సంస్థల విస్తరణ, భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులతో తీరప్రాంత కర్ణాటకపై ప్రభుత్వ దృష్టిని స్పష్టం చేసింది. తుళు భాషకు లభించిన గుర్తింపు మాత్రం ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యం పొందిన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
