NTA పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. JEE మెయిన్, UGC-NET, NIFT తేదీలు చూశారా?
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2026 డిసెంబర్ నుంచి 2027 మార్చి వరకు నిర్వహించనున్న పలు ప్రధాన ప్రవేశ, అర్హత పరీక్షల తాత్కాలిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో UGC-NET, Joint CSIR-UGC NET, NIFT, JEE Main 2027, AISSEE, CUET-PG వంటి కీలక పరీక్షలు ఉన్నాయి. పరీక్షల తేదీలు, బఫర్ డేస్, ఇతర ముఖ్య వివరాలను NTA తన క్యాలెండర్‌లో వెల్లడించింది..

హైదరాబాద్, సెప్టెంబర్ 19: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2026 డిసెంబర్ నుంచి 2027 మార్చి వరకు నిర్వహించనున్న పలు ప్రధాన ప్రవేశ, అర్హత పరీక్షల తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్షలకు ముందుగానే సిద్ధమయ్యేందుకు ఈ షెడ్యూల్ ఉపయోగపడనుంది. పరీక్షలకు సంబంధించిన తుది తేదీలు, పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డులు, ఇతర వివరాలను NTA అధికారికంగా త్వరలోనే ప్రకటించనుంది. ఎన్టీయే క్యాలెండర్ ప్రకారం.. UGC-NET డిసెంబర్ 2026 పరీక్షలు డిసెంబర్ 14 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. అవసరమైతే ఈ పరీక్షల నిర్వహణకు డిసెంబర్ 20, 21 తేదీలను బఫర్ డేస్‌గా కేటాయించారు. అదేవిధంగా Joint CSIR-UGC NET పరీక్షలు డిసెంబర్ 20, 21 తేదీల్లో జరగనున్నాయి.
జనవరిలో కీలక ప్రవేశ పరీక్షలు
NIFT ప్రవేశ పరీక్షను జనవరి 10, 2027న నిర్వహించనున్నట్లు NTA క్యాలెండర్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాలకు కీలకమైన JEE Main 2027 సెషన్-1 పరీక్షలు జనవరి 22 నుంచి 24 వరకు, అలాగే జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. జనవరి 31ను బఫర్ డేగా ఉంచారు. ఇక దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే All India Sainik Schools Entrance Examination (AISSEE) జనవరి 31, 2027న జరగనుంది. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే CUET-PG 2027 పరీక్షలు మార్చి 1 నుంచి 25 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. అభ్యర్థుల సంఖ్య, సబ్జెక్టులు, పరీక్షా విధానం ఆధారంగా వేర్వేరు తేదీల్లో పరీక్షలు జరిగే అవకాశం ఉంది. NTA విడుదల చేసిన క్యాలెండర్ తాత్కాలికమైనది మాత్రమే. పరీక్షల తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ఎప్పటికప్పుడు NTA అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి. అప్లికేషన్ తేదీలు, సిలబస్, పరీక్షా విధానం, అడ్మిట్ కార్డు విడుదల తేదీ, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలను NTA ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా వెల్లడించనుంది.
ముఖ్యమైప పరీక్షల షెడ్యూల్ ఇదే..
- UGC-NET పరీక్ష తేదీలు: డిసెంబర్ 14–19, 2026.
- UGC-NET బఫర్ రోజులుతేదీలు: డిసెంబర్ 20–21, 2026.
- Joint CSIR-UGC NET పరీక్ష తేదీలు: డిసెంబర్ 20–21, 2026.
- NIFT Entrance Exam 2027 పరీక్ష తేదీలు: జనవరి 10, 2027.
- JEE Main 2027 – Session 1 పరీక్ష తేదీలు: జనవరి 22–24, 28–30, 2027.
- JEE Main 2027 బఫర్ డే తేదీ: జనవరి 31, 2027.
- AISSEE 2027 పరీక్ష తేదీలు: జనవరి 31, 2027.
- CUET-PG 2027 పరీక్ష తేదీలు: మార్చి 1–25, 2027.




