Team India: ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్.. ఏకిపారేస్తోన్న మాజీలు..
India vs South Africa 2nd T20I: మొత్తానికి, టీమిండియా కోచ్ గంభీర్ తన 'ఫ్లెక్సిబుల్ బ్యాటింగ్ ఆర్డర్' సిద్ధాంతంపై పునరాలోచించుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. ప్రస్తుత ప్రయోగాలు వికటిస్తోన్న తరుణంలో మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ మాజీ ప్లేయర్లు విమర్శలు చేస్తున్నారు.

Team India: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలవ్వడమే కాకుండా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడంపై మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, డేల్ స్టెయిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో అనూహ్య మార్పులు చేశాడు. కెప్టెన్, జట్టులో అత్యుత్తమ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ కంటే ముందుగా అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపాడు. ఈ ప్రయోగం విఫలమైంది. అక్షర్ పటేల్ 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగా, ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది.
రాబిన్ ఉతప్ప విమర్శలు..
గంభీర్ మాజీ సహచరుడు రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. “భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మీ అత్యుత్తమ బ్యాటర్లు క్రీజులో ఉండాలి. పించ్ హిట్టర్‌గా అక్షర్‌ను పంపితే, అతను దూకుడుగా ఆడాలి. కానీ 21 బంతుల్లో 21 పరుగులు చేయడం సరికాదు. టాప్-3 బ్యాటర్ల స్థానాలు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ప్రయోగాలు చేయడం వల్ల జట్టు స్థిరత్వం దెబ్బతింటుంది,” అని అన్నాడు.
డేల్ స్టెయిన్ ఘాటు వ్యాఖ్యలు..
దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ గంభీర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. “సూర్యకుమార్ మీ బెస్ట్ బ్యాటర్. అతన్ని వెనక్కి నెట్టి అక్షర్‌ను పంపడం ‘మేజర్ మిస్టేక్’ (పెద్ద తప్పు). ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ చేయడానికి సమయం కాదు. అక్షర్‌ను సింహాల గుహలోకి నెట్టినట్లు అనిపించింది. సిరీస్‌లో ఆధిక్యం సాధించే అవకాశం ఉన్న మ్యాచ్‌లో ఇలాంటి ప్రయోగాలు అనవసరం,” అని వ్యాఖ్యానించాడు.
మొత్తానికి, గంభీర్ తన ‘ఫ్లెక్సిబుల్ బ్యాటింగ్ ఆర్డర్’ సిద్ధాంతంపై పునరాలోచించుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో తర్వాతి మ్యాచ్‌లపై ఆసక్తి నెలకొంది.




