Ashes Series: యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ టీంలో సంక్షోభం.. ఆస్ట్రేలియా ఆంక్షలపై ఇంగ్లీష్ ఆటగాళ్ల తిరుగుబాటు.. దాదాపు 10 మంది దూరమయ్యే ఛాన్స్?
AUS vs ENG: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ టీం మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు జరగనుంది. అయితే అంతకు ముందే ఇది సమస్యలకు నిలయంగా మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Ashes Series: ప్రపంచ క్రికెట్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ సిరీస్ తరువాత క్రికెట్ ప్రపంచం ఎదురుచూసేది యాసెష్ సిరీస్ కోసం అనే సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీంల మధ్య జరిగే ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది. కానీ, ఈ సిరీస్ ప్రారంభానికి ముందే కొన్ని అడ్డంకులు వచ్చేలా కనిపిస్తున్నాయి. యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇంగ్లండ్ క్రికెటర్ల కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు, అలాగే వారికి కఠినమైన నిర్బంధ నియమాలతో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కనీసం 10 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు పర్యటన నుంచి వైదొలగొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు జరగనుంది.
నిరాశలో ఆటగాళ్లు.. ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం, చాలా మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు. వారి డిమాండ్లు నెరవేరకపోతే పర్యటన నుంచి వైదొలగే ఆలోచనలో ఉన్నారు. ఈ వారం హెడింగ్లీలో జరిగిన ఇంగ్లండ్ జట్టు సమావేశంలో ఇలాంటి డిమాండ్లే వినిపించాయి. నిబంధనలపై క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి హామీ ఇవ్వలేకపోవడంతో నిరాశకు గురైనట్లు తెలిసింది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లకూ ఇబ్బందే.. ఆస్ట్రేలియాలో కోవిడ్ -19 ను అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చాలా కఠిన నియమాలు అమలు చేస్తోంది. వీటితో ఆస్ట్రేలియా క్రికెట్ టీం కూడా వెస్టిండీస్, బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అడిలైడ్‌లోని హోటల్‌లో రెండు వారాల పాటు నిర్బంధాన్ని పూర్తి చేశారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కూడా ప్రస్తుతం శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లేదు. అక్కడి ప్రభుత్వంపై సీఏకి తగినంత ప్రభావం లేదని తెలుస్తోంది. అలాగే పలు రాష్ట్రాలు కూడా పలు ఆంక్షలతో నగరాలను నిషేధించవచ్చు లేదా పూర్తిగా మూసివేయవచ్చు. ఇంగ్లండ్ బోర్డు మాత్రం ఇప్పటికే ఆటగాళ్ల కోసం చేసుకున్న అన్ని ఒప్పందాల నుంచి కొన్ని సడలింపులు చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వంతో సీఏ మాట్లాడుతోంది.. దీనికి పరిష్కారం కనుగొనడానికి ప్రభుత్వంతోపాటు హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు సీఏ శనివారం తెలిపింది. “రాబోయే యాషెస్ సిరీస్‌కు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా, ఈసీబీ (ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్) ఆస్ట్రేలియాలోని ప్రభుత్వ అధికారులతో తరుచుగా మాట్లాడుతూనే ఉంది” అని ఓ ప్రకటనలో తెలిపింది.
“మేము ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించిన కార్యాచరణను ప్లాన్ చేస్తున్నాం. ఈ సమస్యపై ఈసీబీతో కలిసి పని చేస్తున్నాం” అని తెలిపింది. గత సీజన్‌లో చేసినట్లుగా, సీఏ ప్రభుత్వ భాగస్వామ్యంతో క్రికెట్‌ను నిర్వహించడానికి పని చేస్తుంది. అదే సమయంలో క్రికెటర్ల ఆరోగ్యంతోపాటు భద్రతకు భరోసా ఇచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటాం” అని ప్రకటించింది.