Team India: ఊచకోత అంటే ఇదే.. 43 ఫోర్లు, 24 సిక్సర్లతో 825 పరుగులు.. సీన్ కట్ చేస్తే..

వన్డే క్రికెట్‌లో ఏ జట్టైనా 400 మార్కును దాటడం చాలా తక్కువ., కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ ఫీట్ సధ్యమవుతుంది..

Team India: ఊచకోత అంటే ఇదే.. 43 ఫోర్లు, 24 సిక్సర్లతో 825 పరుగులు.. సీన్ కట్ చేస్తే..
Dhoni Vs Sehwag
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 15, 2022 | 1:05 PM

వన్డే క్రికెట్‌లో ఏ జట్టైనా 400 మార్కును దాటడం చాలా తక్కువ., కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ ఫీట్ సధ్యమవుతుంది. అయితే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఈ స్కోర్ చేస్తే, అవతలి జట్టు ఒత్తిడికి లోనవ్వడం ఖాయం. అయితే ఇందుకు విరుద్ధంగా ఓ మ్యాచ్ జరిగింది. ఇరు జట్లు 400 మార్క్ దాటాయి. గెలుపు కోసం చివరి వరకు పోరాటం చేశాయి. ఈ మ్యాచ్‌లో పరుగుల సునామీ పారిందని చెప్పొచ్చు. ఇక ఇందులో విజేతగా నిలిచిన జట్టు కేవలం మూడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్ ఈ రోజున అంటే 2009 డిసెంబర్ 15న టీమిండియా, శ్రీలంక మధ్య జరిగింది.

రాజ్‌కోట్‌లోని మాధవరావ్ సింధియా క్రికెట్ గ్రౌండ్‌లో ఈ రెండు జట్లు వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. మరోవైపు శ్రీలంక జట్టు ధీటుగానే పోరాడి ఎనిమిది వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. కేవలం మూడు పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది.

సెహ్వాగ్, దిల్షాన్‌లా విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతూ భారత బ్యాట్స్‌మెన్లు ఇన్నింగ్స్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. టీమిండియా తరపున ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(146) సెంచరీ చేయగా.. మరో ఎండ్‌లో సచిన్ టెండూల్కర్‌(69) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. సెహ్వాగ్ 102 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 146 పరుగులు కొట్టాడు. ఇక ఆఖర్లో రవీంద్ర జడేజా 17 బంతుల్లో 30 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. టీమిండియా టోటల్ స్కోర్ 400 పరుగులు దాటింది.

అనంతరం లక్ష్యచేదనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు టాప్ 3 బ్యాటర్లు మంచి స్కోర్ అందించారు. ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ భారత బౌలర్లను చిత్తు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 124 బంతుల్లో 20 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 160 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్ సంగక్కర 43 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు కొట్టాడు. ఇక మరో ఓపెనర్ ఉపుల్ తరంగ 60 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. ఈ ముగ్గురితో పాటు.. చివర్లో మాథ్యూస్(38), కదంబీ(24) ఫర్వాలేదనిపించారు. చివరికి లంకేయులు నిర్ణీత ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 411 పరుగులు చేశారు.

మలుపు తిప్పిన ఆఖరి ఓవర్:

ఈ మ్యాచ్‌లో శ్రీలంక చివరి వరకు పోరాడింది. ఒకానొక దశలో శ్రీలంక మ్యాచ్ గెలుస్తుందని అందరూ భావించారు. అయితే ఆశిష్ నెహ్రా కీలక సమయంలో వికెట్ తీసి ఆటను మలుపు తిప్పాడు. చివరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 11 పరుగులు కావాలి. ఏంజెలో మాథ్యూస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి నెహ్రా అతడిని అవుట్ చేయడంతో భారత్ విజయం ఖాయం అయింది. కాగా, ఈ మ్యాచ్‌లో రెండు జట్లు 43 ఫోర్లు, 24 సిక్సర్లతో 825 పరుగులు నమోదు చేశాయి. అంతేకాకుండా ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయగా.. మరో నలుగురు ప్లేయర్స్ అర్ధ సెంచరీలతో రఫ్ఫాడించారు.