Champions Trophy: వర్షం కారణంగా AFG vs AUS మ్యాచ్ రద్దైతే, సెమీ ఫైనల్‌కు ఎవరు చేరుకుంటారు?లెక్కలివిగో
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను క్రికెట్ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఫలితం తోనే గ్రూప్ బిలో సెమీ-ఫైనల్స్ స్థానాలు ఖరారు కానున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటోంది. ద్వైపాక్షిక సిరీసుల్లో సత్తా చాటుతోన్న ఆ జట్టు ఐసిసి టోర్నమెంట్లలో బలమైన జట్లకు షాక్ ఇస్తోంది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్‌ను ఓడించింది. అంతేకాదు ప్రపంచ కప్ పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్ జట్టు విజయాలతో ఆరంభం కాలేదు. తొలి మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే డూ- ఆర్-డై మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి షాక్ ఇచ్చింది. ఈ పరాజయంతో ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఐసీసీ పోటీల్లో ఇంగ్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది వరుసగా రెండో విజయం.
గ్రూప్ దశలోని మూడవ, చివరి మ్యాచ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. సెమీఫైనల్స్ చేరుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే చివరి అవకాశం. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా గట్టి సవాలును ఎదుర్కొంటుంది. ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 350 పరుగులకు పైగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అందువల్ల, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రస్తుతం చెరో 3 పాయింట్లతో ఉన్నాయి. ఇంగ్లాండ్‌ను ఓడించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ విజయంతో, గ్రూప్ Bలో 3 జట్లు సెమీ-ఫైనల్స్ కోసం పోటీ పడుతున్నాయి. అందువల్ల, ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, వారు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటారు. రషీద్ ఖాన్ నాయకత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ 2024 T20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. మరి, ఈ సంవత్సరం హష్మతుల్లా షాహిది నాయకత్వంలో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా చరిత్ర సృష్టిస్తుందా? అందరి దృష్టి దీనిపైనే ఉంటుంది.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. కాబట్టి ఆస్ట్రేలియాకు 4 పాయింట్లు, ఆఫ్ఘనిస్తాన్ కు 3 పాయింట్లు ఉంటాయి. ఆస్ట్రేలియా 4 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. కాబట్టి దక్షిణాఫ్రికా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌పై గెలవాలి. అలాగే, దక్షిణాఫ్రికా ఓడిపోతే నెట్ రన్ రేట్ కు ప్రాధాన్యం ఉంటుంది. దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ ఆఫ్ఘనిస్తాన్ కంటే మెరుగ్గా ఉంటే, వారు సెమీఫైనల్‌కు చేరుకుంటారు. అయితే, ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్ బాగుంటే, వారు తదుపరి రౌండ్‌కు చేరుకుంటారు.
ఆస్ట్రేలియా జట్టు:
స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్
అఫ్గానిస్తాన్ జట్టు :
హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదికుల్లా అటల్, రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నయీబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఇక్రమ్ అలిఖిల్, నంగేలియా ఖరోటే, నవేద్ జద్రాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








