Border-Gavaskar trophy: అయ్యో KL రాహుల్ – ICC చర్యలు తప్పవా?
KL రాహుల్ ఔట్ వ్యవహారం పెద్ద చర్చగా మారింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినప్పటికీ, DRSలో స్పైక్ ఆధారంగా థర్డ్ అంపైర్ ఔట్ గా తీర్పు ఇచ్చాడు. రాహుల్ తన అసంతృప్తిని వ్యక్తం చేయడం పట్ల ICC చర్య తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆసీస్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు KL రాహుల్ వివాదాస్పదంగా ఔటైన తీరు పెద్ద చర్చనీయాంశమైంది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన ఈ సంఘటనలో ఫీల్డ్ అంపైర్ ప్రారంభంలో రాహుల్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ DRSను కోరడం తో పరిస్థితి తారుమారైంది.
23వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేసిన బంతిని KL రాహుల్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. ఆసీస్ ఆటగాళ్లు పెద్దగా అప్పీల్ చేసినప్పటికీ, ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని ఇచ్చిన తరువాత కమిన్స్ రివ్యూ కోరాడు. స్నికో మీటర్ రీప్లేలో బ్యాట్ దగ్గర స్పైక్ చూపించింది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ రాహుల్ బంతిని బ్యాట్‌తో తాకినట్లు నిర్ణయించి, ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తిరస్కరించాడు. దీంతో KL రాహుల్ నిరాశ చెందాడు. ఈ నిర్ణయం పట్ల రాహుల్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చేతితో సంజ్ఞలు చేయడం స్పష్టంగా కనిపించింది.
రాహుల్‌పై చర్యలు తప్పవా?
ICC చట్టం 42.2 ప్రకారం, ఆటగాళ్లు అంపైర్ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేస్తే, దానికి లెవల్ 1 నేరంగా పరిగణించబడుతుంది. మొదటిసారి జరిగితే, ఆటగాళ్లకు హెచ్చరిక ఇస్తారు. అదే మరల రిపీట్ అవుతే పెనాల్టీ రూపంలో ప్రత్యర్థి జట్టుకు 5 పెనాల్టీ పరుగులు జతచేస్తారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగా, రాహుల్‌పై చర్య తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, భారత పేసర్లు మైదానంలో తిరిగి పుంజుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా 4/17 గణాంకాలతో అద్భుతంగా రాణించాడు. మహ్మద్ సిరాజ్ 2/17తో సహకరించగా, అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా 1/33తో తన మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. స్టంప్స్ సమయానికి ఆసీస్ 67/7తో కష్టాల్లో పడింది. KL రాహుల్ ఔట్ వివాదం మరియు భారత పేసర్ల ప్రదర్శన మొదటి రోజున హైలైట్ అయ్యాయి.