స్పాట్ ఫిక్సింగ్ కేసులో జైలు.. ఆపై 7 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే.. టీమిండియా ప్లేయర్‌కు.!
IPL 2013 Spot Fixing Case: స్పాట్ ఫిక్సింగ్ కేసులో జైలుకు వెళ్లిన ఆటగాడికి ముంబై జట్టు తరపున కీలక బాధ్యత వచ్చింది. అతన్ని ఒక జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించారు. ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఆటగాడు కోచింగ్ రూపంలో తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నాడు.

Ankeet Chavan: 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలి, క్రికెట్ నుంచి దాదాపు 7 ఏళ్లు నిషేధానికి గురైన స్పిన్నర్ అంకిత్ చవాన్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అండర్-14 జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నియామకంపై క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంకిత్ చవాన్ నేపథ్యం..
ముంబైకి చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ అంకిత్ చవాన్, 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, అజిత్ చండీలాతో పాటు అరెస్టయ్యాడు. అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న చవాన్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే, 2021లో బీసీసీఐ అంబుడ్స్‌మన్ అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. తన తప్పును అంగీకరించి, పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో పాటు, ముంబై క్రికెట్ అసోసియేషన్ సిఫార్సు మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. క్రికెట్ కెరీర్ ప్రారంభంలో ముంబై రంజీ జట్టుకు కీలక స్పిన్నర్‌గా రాణించిన చవాన్, 2012-13 సీజన్‌లో ముంబై 40వ సారి రంజీ టైటిల్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 23 పరుగులకు 9 వికెట్లు తీసి సచిన్ టెండూల్కర్ ప్రశంసలు పొందాడు.
కోచింగ్ పాత్రలో చవాన్..
అంకిత్‌పై 2013లో బీసీసీఐ జీవితకాల నిషేధం విధించగా, 2021లో దానిని 7 సంవత్సరాలకు తగ్గించింది. ఆ తర్వాత, అంకిత్ 2023లో క్లబ్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. ముంబైలోని కర్ణాటక స్పోర్ట్స్ క్లబ్ తరపున క్రికెట్ ఆడటం మొదలెట్టాడు. దీంతో పాటు, క్రికెట్ కోచింగ్ కోసం లెవల్-1 పరీక్షలో పాస్ అయ్యాడు. ఆ తర్వాత, ఎంసీఏ అతన్ని ముంబై అండర్-14 జట్టుకు ప్రధాన కోచ్‌గా చేసింది. ముంబై అండర్-14 జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులు కావడం అతని కెరీర్‌లో ఒక కొత్త మలుపు అని చాలా మంది భావిస్తున్నారు. యువ క్రికెటర్లకు మార్గదర్శకత్వం వహించే అవకాశం అతనికి లభించింది. అతని నియామకం పట్ల కొంతమంది క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు “రెండో అవకాశం” ఇవ్వడం సరైనదేనని కామెంట్లు చేస్తున్నారు.
వారికి కీలక బాధ్యత..
ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా దేశీయ సీజన్ కోసం కోచ్, సెలెక్టర్ల నియామకాలను ప్రకటించింది. ఓంకార్ సాల్వి ముంబై రంజీ జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నారు. ఓంకార్ నాయకత్వంలో జట్టు బాగా రాణించింది. భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్‌ను కూడా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..