AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే.. కావ్యపాప దయతో మారిన లైఫ్

Kavya Maran- Amit Kumar: ఐపీఎల్ 2026 వేలంలో చాలా మంది ఆటగాళ్లు అదృష్టాన్ని దక్కించుకున్నారు. వారిలో ఒకరు బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాకు చెందిన అమిత్ కుమార్. దేశీయ క్రికెట్‌లో జార్ఖండ్ తరపున ఆడే అమిత్‌ను కావ్య మారన్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.

రోజూ రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే.. కావ్యపాప దయతో మారిన లైఫ్
Kavya Maran Amit Kumar
Venkata Chari
|

Updated on: Dec 21, 2025 | 4:10 PM

Share

Kavya Maran- Amit Kumar: క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, ఎంతో మంది పేద యువకుల జీవితాలను మార్చే ఒక కల. అటువంటి కలనే కన్నాడు బీహార్‌కు చెందిన 23 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ అమిత్ కుమార్. ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అమిత్‌ను కొనుగోలు చేయడంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ విజయానికి వెనుక ఎంతో కష్టం, కన్నీళ్లు, ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది.

ట్రయల్స్ మిస్.. గుండె పగిలిన వేళ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరపున అదరగొడుతున్న అమిత్ కుమార్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ట్రయల్స్‌కు పిలిచింది. అయితే, విధి వెక్కిరించినట్లుగా అతను ప్రయాణించాల్సిన విమానం రద్దయ్యింది. దీంతో అమిత్ సకాలంలో ట్రయల్స్‌కు చేరుకోలేకపోయాడు. చేతికి వచ్చిన అవకాశం చేజారిపోయిందని, తన ఐపీఎల్ కల చెదిరిపోయిందని అమిత్ ఎంతో కుంగిపోయాడు.

కావ్య మారన్ నమ్మకం: కానీ, సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్, టీమ్ మేనేజ్‌మెంట్ అమిత్ ప్రతిభను అప్పటికే గుర్తించారు. కేవలం ఒక్క ట్రయల్ చూసి నిర్ణయం తీసుకోకుండా, అతని పాత ప్రదర్శనలను, నెట్ బౌలర్‌గా అతని సామర్థ్యాన్ని నమ్మారు. డిసెంబర్ 16న అబుదాబిలో జరిగిన వేలంలో అమిత్ కుమార్‌ను అతని కనీస ధర రూ. 30 లక్షలకు SRH సొంతం చేసుకుంది.

రోజుకు 200 రూపాయల కూలీ నుంచి ఐపీఎల్ వరకు: అమిత్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. బీహార్‌లోని రోహతాస్ జిల్లాకు చెందిన అమిత్, 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత్‌ను చూసి క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నాడు. శిక్షణ కోసం రాంచీకి వెళ్లాడు. అక్కడ అకాడమీ ఫీజులు కట్టడానికి డబ్బులు లేక, గ్రౌండ్స్‌మెన్‌కు సహాయకుడిగా పనిచేశాడు. పిచ్‌లు సిద్ధం చేయడంలో సాయం చేస్తూ రోజుకు కేవలం 200 రూపాయలు సంపాదించేవాడు. ఆ కష్టార్జితంతోనే తన క్రికెట్ కలను నిజం చేసుకున్నాడు.

దిగ్గజాల ప్రశంసలు: రాంచీలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగినప్పుడు అమిత్ నెట్ బౌలర్‌గా వెళ్లేవాడు. అతని లెగ్ స్పిన్ బౌలింగ్‌కు గ్లెన్ మాక్స్‌వెల్, కేశవ్ మహారాజ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఫిదా అయ్యారు. ప్రవీణ్ తాంబే వంటి సీనియర్లు కూడా అతని ప్రతిభను కొనియాడారు.

నేడు అదే నెట్ బౌలర్, ఐపీఎల్ వేదికపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించి బరిలోకి దిగబోతున్నాడు. విమానం మిస్ అయినా, తన లక్ష్యాన్ని మాత్రం మిస్ అవ్వకుండా అమిత్ కుమార్ సాధించిన ఈ విజయం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..