కోహ్లీ, రోహిత్ కాదు.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యుత్తమ ప్లేయర్ అతడే: ధోనీ దోస్త్ సంచలన వ్యాఖ్యలు..!
Greatest IPL Player: ఐపీఎల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నకు మెజారిటీ అభిమానుల నుంచి వచ్చే సమాధానాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదా ఎమ్‌ఎస్ ధోనీ. కానీ, టీమిండియా మాజీ ఆటగాడు, ధోనీకి అత్యంత ఆప్తుడైన అంబటి రాయుడు మాత్రం వీరందరినీ కాదని ఒక విదేశీ ఆటగాడిని ఐపీఎల్ చరిత్రలోనే ‘సమర్థవంతమైన ఆటగాడు’గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

IPL Greatest Of All Time: గడిచిన పంతొమ్మిదేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌గా విరాజిల్లుతోంది. ఎంతో మంది దిగ్గజాలు ఈ వేదికపై తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లోనే విరాట్ కోహ్లీ తన 9000 పరుగుల మైలురాయిని దాటగా, రోహిత్ శర్మ 7500 పరుగుల దిశగా దూసుకుపోతున్నాడు. ఇక కెప్టెన్‌గా ధోనీ 5 ట్రోఫీలు అందిస్తే, సురేష్ రైనా ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో కీలక సభ్యుడిగా ఉండి, ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన అనుభవమున్న అంబటి రాయుడు మాత్రం వీరందరి కంటే ఒక భిన్నమైన ఆటగాడిని అత్యుత్తమ ప్లేయర్‌గా ఎంచుకున్నాడు.
రాయుడు దృష్టిలో ఐపీఎల్ ‘మహా వీరుడు’ అతడే..!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు నమ్మకమైన ఆయుధంగా మారిన వెస్టిండీస్ మాజీ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను రాయుడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా అభివర్ణించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోయినప్పటికీ, నరైన్ ఎప్పటిలాగే నిశ్శబ్దంగా తన పని ముగించాడు. 4 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆధునిక టీ20 క్రికెట్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న తరుణంలో, నరైన్‌కు ఇది చాలా సాధారణమైన ప్రదర్శన కావచ్చు. కానీ, మ్యాచ్ ఫలితాన్ని మార్చగల అతని సామర్థ్యమే అతడిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుందని రాయుడు కొనియాడాడు.
ఇది కూడా చదవండి: IND vs AFG: ఆఫ్ఘాన్‌తో సిరీస్‌కు భారత జట్టు.. ఛోటా ప్యాకెట్ రీఎంట్రీ ఫిక్స్..!
“సునీల్ నరైన్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ నిజమైన మ్యాచ్ విన్నర్. ఐపీఎల్‌లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉండవచ్చు. కానీ, నరైన్ ఎప్పుడూ అందరికంటే భిన్నంగా, అగ్రస్థానంలో ఉంటాడు. నా దృష్టిలో అతడే నంబర్ వన్” అని రాయుడు స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లో నరైన్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి, కేవలం 6.69 ఎకానమీతో పరుగులు నియంత్రించడం విశేషం.
పదిహేనేళ్లుగా అదే పదును.. అదే మాయాజాలం..!
సునీల్ నరైన్ 2012లో కోల్‌కతా జట్టులో చేరాడు. ఆ ఏడాది 24 వికెట్లు పడగొట్టి జట్టు తొలిసారి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2014లో కూడా 21 వికెట్లతో జట్టును విజేతగా నిలిపాడు. ఇటీవల గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌తో నరైన్ ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. విశేషం ఏంటంటే, ఈ 200 మ్యాచ్‌లూ అతడు ఒకే ఒక్క జట్టు (కేకేఆర్) తరపున ఆడటం. ఇప్పటివరకు 198 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన నరైన్ 205 వికెట్లు తీశాడు. అతని కెరీర్ ఎకానమీ రేటు కేవలం 6.79 మాత్రమే కావడం విశేషం. బ్యాటర్ల ఆధిపత్యం నడుస్తున్న ఈ కాలంలో కేవలం 7 సీజన్లలో మాత్రమే అతని ఎకానమీ 7 దాటింది, కానీ ఎప్పుడూ 8కి చేరలేదు.
కోహ్లీ, రోహిత్ కంటే నరైన్ ఎందుకు గొప్ప?
కేవలం బౌలింగ్‌లోనే కాకుండా ఓపెనర్‌గా వచ్చి విధ్వంసకర బ్యాటింగ్‌తో నరైన్ ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. 165.30 స్ట్రైక్ రేట్‌తో ఇప్పటివరకు 1820 పరుగులు చేశాడు. ముఖ్యంగా 2024లో కోల్‌కతా మూడోసారి కప్పు గెలిచినప్పుడు ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో 488 పరుగులు చేయడం గమనార్హం.
రాయుడు విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మల పేర్లను నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, ప్రస్తుత క్రికెట్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిందని అభిప్రాయపడ్డాడు. అలాంటి పరిస్థితుల్లోనూ గత 15 ఏళ్లుగా బ్యాటర్లను వణికస్తూ, ఒత్తిడిని అధిగమించి బౌలర్‌గా రాణించడం పరుగుల వీరుల కంటే గొప్ప విషయమని రాయుడు విశ్లేషించాడు.
క్రికెట్‌లో రికార్డులు, పరుగులు మాత్రమే ఒక ఆటగాడి గొప్పతనాన్ని నిర్ణయించలేవు. జట్టుకు అవసరమైనప్పుడు బంతితో, బ్యాట్‌తో ఊహించని రీతిలో ప్రభావం చూపే సునీల్ నరైన్ లాంటి ‘ఎక్స్ ఫ్యాక్టర్’ ఆటగాళ్లే నిజమైన విజేతలని అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




