ICC World Cup Boycotts: బాంబుల భయం..బోర్డర్ల గొడవ..30ఏళ్లలో ప్రపంచ కప్‌తో ఆడబోమని మొండికేసిన జట్లు ఇవే
ICC World Cup Boycotts: ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలు అంటేనే హై వోల్టేజ్ పోరుకు కేరాఫ్ అడ్రస్. కానీ కొన్నిసార్లు ఆటగాళ్ల టాలెంట్ కంటే దేశాల మధ్య ఉండే రాజకీయ వైషమ్యాలు, భద్రతాపరమైన ఆందోళనలు వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ వచ్చేందుకు బంగ్లాదేశ్ సృష్టించిన రచ్చ ఈ చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చింది.

ICC World Cup Boycotts: ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలు అంటేనే హై వోల్టేజ్ పోరుకు కేరాఫ్ అడ్రస్. కానీ కొన్నిసార్లు ఆటగాళ్ల టాలెంట్ కంటే దేశాల మధ్య ఉండే రాజకీయ వైషమ్యాలు, భద్రతాపరమైన ఆందోళనలు వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ వచ్చేందుకు బంగ్లాదేశ్ సృష్టించిన రచ్చ ఈ చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చింది. గత 30 ఏళ్ల కాలంలో వరల్డ్ కప్ వేదికగా జట్లు ఆడేందుకు నిరాకరించిన ఆరు ప్రధాన సంఘటనలు ఏవో వివరంగా చూద్దాం.
1. 1996 వన్డే వరల్డ్ కప్: క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఒక పెద్ద జట్టు వరల్డ్ కప్ మ్యాచ్ ఆడబోమని తేల్చి చెప్పిన సంఘటన ఇది. శ్రీలంక, భారత్, పాకిస్థాన్‌లు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించాయి. అయితే అప్పట్లో శ్రీలంకలో ఎల్టీటీఈ అంతర్యుద్ధం తారాస్థాయిలో ఉంది. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్ సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించడంతో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు శ్రీలంకలో అడుగుపెట్టడానికి భయపడ్డాయి. ఐసీసీ ఎన్ని హామీలు ఇచ్చినా అవి వినలేదు. ఫలితంగా శ్రీలంకకు వాకోవర్ లభించింది. ఆశ్చర్యకరంగా అదే ఏడాది శ్రీలంక వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
2. 2003 వన్డే వరల్డ్ కప్: సౌతాఫ్రికా, జింబాబ్వే, కెన్యా వేదికగా ఈ టోర్నీ జరిగింది. అప్పట్లో జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనపై తీవ్ర నిరసనలు ఉండేవి. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ ఇంగ్లండ్ జట్టు హరారేలో జింబాబ్వేతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించింది. భద్రతా కారణాల కంటే రాజకీయ కారణాలే ఇక్కడ ఎక్కువగా పనిచేశాయి. ఈ నిర్ణయంతో ఇంగ్లండ్ విలువైన పాయింట్లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
3. 2003 వన్డే వరల్డ్ కప్: అదే 2003 వరల్డ్ కప్‌లో మరో వివాదం చోటుచేసుకుంది. నైరోబీలో భద్రతా పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, తీవ్రవాద ముప్పు పొంచి ఉందని న్యూజిలాండ్ జట్టు కెన్యాలో ఆడేందుకు నిరాకరించింది. ఐసీసీ పట్టుబట్టినప్పటికీ న్యూజిలాండ్ జట్టు వెనక్కి తగ్గలేదు. దీనివల్ల కెన్యాకు పాయింట్లు లభించాయి. ఆ అదనపు పాయింట్ల సహకారంతో కెన్యా ఆ ఏడాది సెమీఫైనల్ వరకు దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది.
4. 2009 టీ20 వరల్డ్ కప్: ఇది మిగిలిన వాటికంటే కాస్త డిఫరెంట్. బ్రిటన్ ప్రభుత్వంతో ఉన్న దౌత్యపరమైన విభేదాల కారణంగా జింబాబ్వే జట్టు ఇంగ్లండ్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ నుంచి తన పేరును వెనక్కి తీసుకుంది. ఇంగ్లండ్ ప్రభుత్వం జింబాబ్వే క్రికెటర్లకు వీసాలు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ వివాదం తలెత్తింది. ఫలితంగా వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు ఐసీసీ అవకాశం కల్పించింది.
5. 2016 అండర్-19 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు రాలేదు. తమ దేశ గూఢచారి సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికల ప్రకారం బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఆసీస్ బోర్డు భావించింది. ఐసీసీ అత్యున్నత భద్రత కల్పిస్తామని చెప్పినా ఆస్ట్రేలియా వినిపించుకోకుండా టోర్నీని బహిష్కరించింది. వారి స్థానంలో ఐర్లాండ్ జట్టు టోర్నీలో పాల్గొంది.
6. 2026 టీ20 వరల్డ్ కప్: భారత్ రావడానికి బంగ్లాదేశ్ అభ్యంతరం తాజా వివాదం ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల వల్ల తాము ఇండియాలో ఆడలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తమ మ్యాచ్‌లను న్యూట్రల్ వేదిక అయిన శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అయితే భద్రతా పరంగా ఇండియాలో ఎలాంటి ఇబ్బంది లేదని ఐసీసీ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఒకవేళ బంగ్లాదేశ్ మొండికేసింది. దీంతో వారిపై వేటుపడింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
