Vaibhav Suryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్.. 10 ఫోర్లు, 7 సిక్సులతో ఇంగ్లాండ్ గడ్డపై ఫాస్టెస్ట్ సెంచరీ
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ పర్యటనలో అదరగొడుతున్నాడు. యూత్ వన్డేలలో ఈ యంగ్ బ్యాట్స్ మెన్ 52 బంతుల్లో వేగవంతమైన సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. అతను కమ్రాన్ గులాం రికార్డును బద్దలు కొట్టి, భారత అండర్-19 జట్టుకు సిరీస్‌లో ఆధిక్యాన్ని అందించాడు.

Vaibhav Suryavanshi : క్రికెట్ ప్రపంచంలో యువ ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా యూత్ వన్డేలలో వేగవంతమైన సెంచరీలు నమోదు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. టీం ఇండియా అండర్-19 క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అక్కడ ఆతిథ్య ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సిరీస్‌లో 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. సిరీస్‌లోని నాలుగో వన్డేలో వైభవ్ 190కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఒక అద్భుత సెంచరీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అతను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ 40 పరుగుల మార్కును దాటాడు.
వూస్టర్‌లోని న్యూ రోడ్ మైదానంలో జరిగిన నాలుగో యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. అతను మ్యాచ్ ప్రారంభం నుంచే చాలా వేగంగా పరుగులు తీశాడు. అతని సెంచరీ ఇన్నింగ్స్‌లో సిక్స్ లు, ఫోర్లు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేయడానికి కేవలం 52 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో అతను యూత్ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ గా నిలిచాడు. ఇంతకు ముందు యూత్ వన్డేలో ఏ ఆటగాడూ ఇంత ఫాస్టుగా సెంచరీ చేయలేదు.
ఈ జాబితాలో ప్రస్తుతం భారత అండర్-19 జట్టు ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2025లో ఇంగ్లాండ్ U-19 జట్టుపై కేవలం 52 బంతుల్లో సెంచరీ చేసి అతను సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన ద్వారా, వైభవ్ గతంలో కమ్రాన్ గులాం పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. గులాం 2013లో ఇంగ్లాండ్ U-19 జట్టుపై 53 బంతుల్లో సెంచరీ సాధించి అప్పట్లో వేగవంతమైన శతకంతో నిలిచాడు.
ఈ జాబితాలో బంగ్లాదేశ్ U-19 ఆటగాడు తమీమ్ ఇక్బాల్ కూడా ఉన్నాడు. అతను 2005-06లో ఇంగ్లాండ్ U-19 జట్టుపై 68 బంతుల్లో సెంచరీ సాధించాడు. అలాగే, రాజ్ అంగద్ బావా (ఇండియా U-19) 2021-22లో ఉగాండా U-19 జట్టుపై 69 బంతుల్లో సెంచరీతో మెరిశాడు. అదే 69 బంతుల్లో ఆస్ట్రేలియా U-19 ఆటగాడు షాన్ మార్ష్ 2001-02లో కెన్యా U-19 జట్టుపై సెంచరీ చేసి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఇంతకుముందు జూలై 2న నార్తాంప్టన్‌లో జరిగిన మూడో వన్డేలో కూడా వైభవ్ 31 బంతుల్లో 86 పరుగులతో అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 9 సిక్స్‌లు, 6 ఫోర్లు కొట్టాడు. దీనివల్ల వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ 269 పరుగుల లక్ష్యాన్ని 34.3 ఓవర్లలోనే ఛేదించింది. అతని ఈ ఇన్నింగ్స్ భారత అండర్-19 జట్టుకు సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని అందించింది. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది.
వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్ పర్యటన ఇప్పటివరకు చాలా అద్భుతంగా సాగింది. అతను ఈ సిరీస్‌లో ఆడిన ప్రతి ఇన్నింగ్స్‌లోనూ బ్యాటుతో మెరుపులు మెరిపించాడు. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో 48 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో 45 పరుగులు చేశాడు. మళ్ళీ 86 పరుగులు కొట్టాడు. ఇప్పుడు సెంచరీ కూడా సాధించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..