AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గోవిందా’ అంటే అర్థం తెలుసా..? ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తప్పక తెలుసుకోండి

Govinda Mean: గోవిందా అనే నామం తెలుగు ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కలగజేసే ఒక అమృత తుల్యమైన పదం. తిరుమల శ్రీవారి ఆలయం ప్రాంగణం అంతా నిరంతరం భక్తుల గోవింద నామఘోషతో ప్రతిధ్వనిస్తూ ఉండే ఆ దృశ్యం దైవానుభూతిని కలిగిస్తుంది. కానీ “గోవింద” అనే నామం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? ఈ పేరు ఎలా ఏర్పడింది? అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

‘గోవిందా’ అంటే అర్థం తెలుసా..? ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తప్పక తెలుసుకోండి
Govinda Name
Rajashekher G
|

Updated on: Feb 24, 2026 | 1:35 PM

Share

“ఏడుకొండలవాడా… వేంకటరమణా… గోవిందా గోవిందా…”.. ఈ నామస్మరణ వినగానే ప్రతి తెలుగువాడి హృదయం భక్తిరసంతో నిండిపోతుంది. తిరుమల శ్రీవారి ఆలయం ప్రాంగణం అంతా నిరంతరం భక్తుల గోవింద నామఘోషతో ప్రతిధ్వనిస్తూ ఉండే ఆ దృశ్యం దైవానుభూతిని కలిగిస్తుంది. కానీ “గోవింద” అనే నామం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? ఈ పేరు ఎలా ఏర్పడింది? అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గోవర్ధనగిరి కథ – గోవింద నామ ఆవిర్భావం

ఈ నామం మూలం ద్వాపరయుగంలో గోకులంలో జరిగిన ఒక విశేష సంఘటనతో అనుసంధానమై ఉంది. గోకులవాసులు ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగానే ఆ ఏడాది కూడా ఇంద్రుని పూజించేందుకు సిద్ధమవుతారు. అప్పుడు బాలకృష్ణుడు వారికి ఉపదేశిస్తూ, ప్రకృతిని పోషించే గోవర్ధనగిరిని, గోవులను, తమ కృషిని గౌరవించాలని సూచిస్తాడు. ఆయన మాట విని.. గోకులవాసులు ఇంద్రపూజను విరమిస్తారు.

దీంతో కోపోద్రిక్తుడైన ఇంద్రుడు భీకరమైన వర్షాలతో, ఉరుములతో గోకులాన్ని ముంచెత్తుతాడు. ఆపదలో ప్రజలను, గోవులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో ఎత్తి గొడుగులా పట్టుకుంటాడు. ఏడు రోజుల పాటు గోకులవాసులందరూ ఆ గిరి క్రింద సురక్షితంగా ఉంటారు. ఈ దివ్యలీలను చూసి ఇంద్రుడి అహంకారం చెరిగిపోతుంది.

తరువాత ఇంద్రుడు స్వయంగా వచ్చి శ్రీకృష్ణుని క్షమాపణలు కోరుతాడు. అదే సమయంలో గోమాత అయిన కామధేనువు వచ్చి, తన సంతానమైన గోవులను రక్షించిన కృష్ణునికి పాలాభిషేకం చేస్తుంది. ఇంద్రుడు తన వాహనమైన ఐరావతం ద్వారా గంగాజలంతో అభిషేకం చేయిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా ప్రకటిస్తాడు.. “నేను దేవతలకే ఇంద్రుడిని; కానీ గోవులకు, భూమికి, ప్రజలకు అధిపతిగా మీరు గోవిందుడిగా పిలువబడతారు.”

అప్పటి నుంచి శ్రీకృష్ణుడు “గోవింద” అనే నామంతో భక్తుల ఆరాధనను అందుకుంటున్నాడు.

“గోవింద” అనే పదార్థం

“గో” అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి: వాటిలో గోవులు, భూమి, ఇంద్రియాలు, వేదాలు. “వింద” అంటే రక్షించేవాడు, ఆనందింపజేసేవాడు, తెలిసినవాడు. అందువల్ల గోవింద అంటే.. గోవులను రక్షించినవాడు, భూమిని కాపాడినవాడు, ఇంద్రియాలను నియంత్రించేవాడు, వేదార్థాన్ని గ్రహించినవాడు.. ఇలా అన్నీ కలిపి, సర్వజీవరక్షకుడు అనే విశిష్టమైన అర్థం వస్తుంది.

తిరుమలలో గోవింద నామస్మరణ

కలియుగంలో వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని “గోవింద” అని సంభోదించడం ఆనవాయితీగా మారింది. ఏడుకొండల వాడైన వేంకటరమణుడు, గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుడే అన్న భావనతో భక్తులు “గోవిందా… గోవిందా…” అని నినదిస్తారు.

ఈ నామస్మరణలో భక్తి ఉంది, భరోసా ఉంది, శరణాగతి ఉంది. కష్టసమయంలో “గోవిందా!” అని పలికితే రక్షణ లభిస్తుందనే విశ్వాసం కోట్లాది హృదయాల్లో స్థిరంగా ఉంది.

అందుకే.. ఏడుకొండలవాడా… వేంకటరమణా… గోవిందా గోవిందా! ఈ నామమే భక్తికి ఆధారం, ఈ నామమే మోక్షానికి మార్గదర్శి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం అందుబాటులోని వివిధ వనరుల నుంచి సేకరించి.. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని విశ్వసించడం మీ వ్యక్తి గతం. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us