Vastu Tips: ఆఫీసులో దేవుడి ఫోటో పెట్టే ముందు ఇది తెలుసుకోండి.. లేదంటే నష్టాలు తప్పవు!
ఆఫీసులో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం రావడం లేదా? అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయా? అయితే మీ పని ప్రదేశంలో దేవుని ఫోటోలు వాస్తు ప్రకారం ఉన్నాయో లేదో ఒక్కసారి చూసుకోండి. సరైన దిశలో దేవుడిని ప్రతిష్టించడం వల్ల మానసిక ప్రశాంతతే కాకుండా, ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఆఫీసులో ఉండాల్సిన దేవుడు ఎవరు? ఆ వివరాలు ఈ కథనంలో..

కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటేనే పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. సంపదకు అధిపతి అయిన కుబేరుడు, విఘ్నాలను తొలగించే గణనాథుడు.. ఇలా ఏ దేవుని ఫోటో ఏ దిశలో ఉండాలనే విషయంపై కొన్ని రకాల విషయాలను పండితులు చెప్తున్నారు. పొరపాటున కూడా కొన్ని దిశల్లో ఫోటోలు పెడితే ప్రతికూల ఫలితాలు రావచ్చు. వాస్తు శాస్త్రం చెబుతున్న ఆ ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం..
ఏ దేవుని ఫోటో ఎక్కడ ఉండాలి?
విఘ్నహర్త గణేశుడు: ఆఫీసులో అత్యంత ముఖ్యమైన దేవుడు గణేశుడు. అడ్డంకులను తొలగించి విజయాన్ని అందించే వినాయకుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఆఫీసు యొక్క పశ్చిమ భాగంలో ఉంచడం శుభప్రదం. మీరు కూర్చునే సీటు వెనుక లేదా ముందు భాగంలో గణేశుడు ఉంటే పనిలో ఆటంకాలు తొలగిపోయి, సహోద్యోగుల మధ్య సామరస్యం పెరుగుతుంది.
సంపద ప్రదాత కుబేరుడు: ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగాలంటే ఉత్తర దిశలో కుబేరుడి ఫోటో ఉంచాలి. ఉత్తరం కుబేరుడికి ఇష్టమైన దిశ. ఇక్కడ కుబేరుడిని ప్రతిష్టించడం వల్ల అనవసర ఖర్చులు తగ్గి, పొదుపు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి త్వరగా విముక్తి లభిస్తుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం: సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవి ఫోటోను ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఉంచడం మంచిది. ముఖ్యంగా నగదు ఉంచే ప్రదేశం లేదా అకౌంట్స్ విభాగంలో లక్ష్మి ఫోటో ఉండటం వల్ల వ్యాపార వృద్ధి చెందుతుంది. అయితే, దేవుని ఫోటోలు ఎప్పుడూ చీకటిగా ఉండే చోట కాకుండా, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉండాలని గుర్తుంచుకోవాలి.
గమనించాల్సిన ముఖ్యమైన వాస్తు సూత్రాలు:
దక్షిణ దిశ వద్దు: యముడికి నిలయమైన దక్షిణ దిశలో దేవుని ఫోటోలను ఉంచకూడదు. ఇది ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుంది.
పరిశుభ్రత: దేవుని ఫోటోలపై దుమ్ము, ధూళి ఉండకూడదు. నిత్యం వాటిని శుభ్రం చేస్తూ, వీలైతే దీపం లేదా అగరుబత్తీలు వెలిగించడం వల్ల సానుకూలత పెరుగుతుంది.
బెడ్‌రూమ్‌లో వద్దు: కార్యాలయ నియమాలే కాకుండా, ఇంట్లో కూడా బెడ్‌రూమ్‌లో దేవతల ఫోటోలు ఉంచకూడదని వాస్తు చెబుతోంది.
గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. మీ నమ్మకాన్ని బట్టి, నిపుణుల సలహాతో మార్పులు చేసుకోండి.
